తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీపై ప‌రోక్షంగా కామెంట్లు చేస్తూ ఆయ‌న సుతిమెత్త‌గా కౌంట‌ర్లు ఇచ్చారు. దేశంలో మతం, రాజకీయం, జాతీయవాదం పరస్పరం విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయని, మతాన్ని రాజకీయాన్ని మిళితం చేయడంవల్ల రాబోయే ప్రమాదాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. . తెలుగువర్సిటీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన తెలంగాణ వికాససమితి (టీవీఎస్) మూడో రాష్ట్ర మహాసభల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.


జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడిలా పొగుడుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మహాత్ముడినే గౌరవించుకోలేని జాతి ఎటుపోతున్నదని ప్రశ్నించారు. సెక్యులర్ దేశం అంటే మతాన్ని రద్దుచేయడంగానీ.. మరో మతాన్ని ముద్దు పెట్టుకోవడంకానీ కాదని స్పష్టంచేశారు. `నేను అమెరికాలో చదువుకున్నా. ఉద్యోగంచేశా. నేను అక్కడ ఉన్నప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారు. సెప్టెంబర్ 11 దాడుల అనంతరం ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడు ఆయన.. అయితే నాతో ఉన్నావు.. నాతో లేవంటే.. నాకు వ్యతిరేకంగా ఉన్నట్లే లెక్క కడుతా అనేమాట అన్నారు. ఈరోజు మనదేశ రాజకీయ పరిస్థితి ఇదేవిధంగా ఉన్నది. నాతో ఉంటే నీవు దేశభక్తుడివి.. లేకుంటే నీవు దేశద్రోహివి అనే పరిస్థితి మనదేశంలో కూడా దాదాపుగా ఉన్నది. చర్చకు, తర్కానికి, విభిన్న అభిప్రాయాలకు, వైరుధ్యాలకు, మిత్రవైరుధ్యాలకు కూడా విలువలేని పరిస్థితి మనదేశంలో వస్తోంది.`` అని అన్నారు.


సెక్యులర్ దేశం అంటే మతాన్ని రద్దుచేయడం కాదని కేటీఆర్ అన్నారు. ``ఏ మతాన్ని రద్దుచేయమని చెప్పలేదు...అదే సమయంలో ఒక మతాన్ని ముద్దుచేయమని కూడా ఎక్కడా చెప్పలేదు. సెక్యులర్ స్టేట్ అంటే పరస్పరం ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవిస్తూ.. ఒకరి మతసంప్రదాయాలు, విశ్వాసాలు, వాటన్నింటిని గౌరవిస్తూనే పరస్పరం సహనంతో మనుగడ సాగించడం.``అని కేటీఆర్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: