రాజకీయాల్లో ఆధిపత్య పోరు ఎప్పుడు వినిపించే మాట. ఒకే పార్టీలో ఉన్న నేతల మధ్య పలు విషయాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ వర్గానికి కాంట్రాక్ట్ లు దక్కలోనో లేదా పదవులు దక్కలోనో చూస్తుంటారు. అయితే ఇలాంటి వాటికి విభిన్నంగా ఓ అభివృద్ధి కార్యక్రమం విషయంలో నెల్లూరు జిల్లా కావలి వైసీపీలోని మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఆధిపత్య పోరుకు తెర లేపారు. ఇటీవల కావలి నియోజకవర్గంలో ఉన్న రామయపట్నం పోర్టు నిర్మాణంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో మాట్లాడారు. దీనికి సంబంధించి కేంద్రం కూడా స్పందిస్తూ.. త్వరలోనే పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 


ఇక ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి..దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని అనుకున్నారు. రామయపట్నం పోర్టు కోసం గతంలో వంటేరు పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రకటనని మీడియాలో వివరించాలని కావలి ఆర్ & బీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులు వంటేరు సమావేశాన్ని అడ్డుకున్నారు. 


అసలు ఎమ్మెల్యే లేకుండా కావలి అభివృద్ధి విషయాలపై ఎలా ? మీడియాతో మాట్లాడుతారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పరిస్థితిని గమనించిన పోలీసులు మాజీ ఎమ్మెల్యే వంటేరుకి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అయితే దీనికి వంటేరు అనుచరులు కౌంటర్ ఇవ్వాలని అనుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుల చేసిన తతంగాన్ని వెంటనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో కావలిలో ఆధిపత్య పోరు కాస్తా అమరావతికి చేరింది.


ఇదిలా ఉంటే ఎప్పటి నుంచో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. మొన్న ఎన్నికలకు ముందు కావలి వైసిపి టికెట్టు తమదేనంటూ వంటేరు ప్రకటించుకున్నారు. కానీ అధిష్టానం అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డికి టికెట్ ఇచ్చారు. దాంతో వంటేరు అలకబూని పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ తర్వాత అధినేత ఆదేశాలతో రామిరెడ్డికి మద్ధతు ఇచ్చారు. మరోసారి రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 


దాంతో నియోజకవర్గంలో ఏ పని అయిన రామిరెడ్డి అనుచరుల మద్ధతుతోనే జరుగుతూ వస్తోంది. దీంతో వంటేరు వర్గం సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే రామయపట్నం ఇష్యూతో ఇరు వర్గాల్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.  ఈ విభేదాలని వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: