తెలుగుదేశం పార్టీ ని వీడుతున్నట్లుగా తనపై పదే, పదే తప్పుడు కథనాలు రాస్తున్న ఒక వెబ్ సైట్ పై తెలుగు యువత రాష్ర్ట అధ్యక్షుడు దేవినేని అవినాష్  సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తనపై నిరాధార వార్తలు ప్రచురిస్తున్నారని అయన చెప్పుకొచ్చారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్ గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మంత్రి కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు . అయినా ఓటమిని పెద్దగా లెక్క చేయకుండా   టీడీపీలో కమిట్మెంట్ తో  పనిచేస్తున్నారు .


 అయితే ఒక వెబ్ సైట్ నిర్వాహకులు  తన ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా, తన విశ్వసనీయతకు భంగం వాటిల్లేలా తప్పుడు  కథనాలు  రాస్తున్నారని , వారిపై  చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దేవినేని అవినాష్ సైబర్ పోలీసులను  కోరారు. అనంతరం దేవినేని అవినాష్ న్యాయనిపుణులతోనూ చర్చించి , సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై  పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .   ఒకటి రెండు రోజుల్లో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా  వార్తలు రాస్తున్న వెబ్ సైట్ నిర్వాహకులపై పరువునష్టం దావా వేయనున్నట్లు సమాచారం .


తమ రేటింగుల కోసం, ఒక పార్టీ మెప్పు పొందేందుకు తనను వ్యక్తిగతంగా   టార్గెట్ చేస్తున్నారని , ఇది మంచి పద్దతి కాదని, ఇకనైనా సదరు వెబ్ సైట్ నిర్వాహకులు తమ విధానాన్ని మార్చుకోవాలని దేవినేని అవినాష్ సూచించారు . సోషల్ మీడియా లో , వెబ్ సైట్ లలో వస్తున్న కథనాల పట్ల టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లుగా కన్పిస్తోంది . టీడీపీ ని వీడుతున్నట్లు పదే , పదే సోషల్ మీడియా లో , వెబ్ సైట్లలో కథనాలు రావడం వల్ల రాజకీయంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తోన్న పలువురు టీడీపీ నేతలు , అవినాష్ తరహాలోనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: