ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు వరమైంది. 2009 లో వచ్చిన వరదతో పోలిస్తే తక్కువే అయినా మన ప్రాణ ధారలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో ప్రజలు, రైతుల మోములో ఆనందం విరబూస్తోంది. మన జలాశయాలు నిండుకుండలా తొణికిసలాడుతుండటంతో రైతుల్లో గుండెల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

 

 

 

ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండిపోయి ఏకంగా 10 గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు సాయంత్రానికి తుంగభద్ర ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత వరద రానుంది. దీంతో అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పది గేట్లు ఎత్తి నీటిని కిందికి వదుల్తున్నారు. ఈ నీటి  ప్రవాహానికి దిగువున ఉన్న నాగార్జున సాగర్ నిండిపోతోంది. 2009లో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ఆ పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా సాగర్ అధికారులు మొదట 4 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలేస్తున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు పూజలు చేసి కృష్ణమ్మను వదిలారు. గంట తర్వాత మరో రెండు గేట్లు కూడా ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందికి కదులుతోంది.  శ్రీశైలం ప్రాజెక్టు అందాలతో ఇప్పటికే ఆ ప్రాంతం పులకిస్తోంది. ఇప్పడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర కూడా కిందికి వచ్చే జలకళ మరింత ఆకట్టుకుంటోంది. మరింత వరద సాగర్ కు రానుండటంతో ఇప్పటి నుంచీ నాగార్జునసాగర్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

 

 

శ్రీశైలానికి 8లక్షల 46వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో సాగర్ కు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లోకి 9.25లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 556 అడుగుల వద్ద ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 223.19 టీఎంసీలుగా ఉంది. ఇలా ప్రాజెక్టులు రెండూ నిండడడం రెండు రాష్ట్రాలకు శుభపరిణామం.

మరింత సమాచారం తెలుసుకోండి: