టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల జమ్మూకాశ్మీర్‌ నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన లడక్‌లో.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ధోనీ గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాలో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆర్మీకి సేవలు చేయడానికి రెండు నెలలు క్రికెట్ కు తాత్కాలిక విరామం ప్రకటించి జమ్మూ, కాశ్మీర్ పుల్వామా జిల్లాలో పారా రెజిమెంట్ యూనిట్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ధోని.  గత నెలాఖర్లో సైన్యంతో చేరారు.  అప్పటినుంచి ఆర్మీకి సేవలు అందిస్తూ వస్తున్నారు.

2011లో భారత్ జట్టుకి 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ అందించిన ధోనీకి పారాచ్యూట్ రెజిమెంట్‌లో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా లభించింది. ఆ తర్వాత 2015లో రెండు వారాలపాటు ఆగ్రాలోని పారాట్రాపర్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఈ మాజీ కెప్టెన్.. ఏకంగా ఐదు సార్లు ఎయిర్‌క్రాప్ట్ నుంచి పారాచ్యూట్‌తో దూకి అన్ని విధులకీ అర్హత సాధించారు. తాజాగా అతనికి దక్షిణ కాశ్మీర్‌లో ఆర్మీ బాధ్యతలు అప్పగించింది. డ్యూటీలో భాగంగా సైన్యంతో కలిసి పహారా కాయడం, బందో బస్తుకి వెళ్లడం తదితర బాధ్యతల్ని ధోనీ నిర్వర్తిస్తున్నారు. కల్నల్ ర్యాంక్ హోదాలో ఉన్న ధోనికి ప్రత్యేక గది సౌకర్యాన్ని ఆర్మీ కల్పిస్తున్నా.. సాధారణ సైనికుడి తరహాలో బ్యారక్‌లోనే భోజనం చేస్తూ వారితోనే నిద్రపోతున్నారు. 


ఈ నెల 15 వరకూ సైన్యంతో కలిసి పనిచేయనున్న ధోనీ..తన టీమ్‌తో కలిసి లడక్‌లోని లేహ్‌కి వెళ్లాడు.  అక్కడే స్వాతంత్ర్య దినోత్సవం వరకూ డ్యూటీలో ఉండనున్నారు.  అక్క జాతీయ జెండాని ధోనీతో అక్కడ ఎగురవేయించాలని ఆర్మీ అధికారులు యోచిస్తున్నారు. భారత సైన్యానికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని.., ప్రస్తుతం అతను విధులను నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఆర్మీ అధికారులు చెప్పారు. సైనిక బలగాలతో కలసి విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో ఉంటారని  వివరించారు.  మొత్తంమీద.. పంద్రాగష్టున ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో లఢక్ లోని లేహ్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనుండటంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: