ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత టీడీపీ ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీకావు. నిజానికి గ‌తంలో వైఎస్ హ‌యాంలో కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. ఉమ్మ‌డి రాష్ట్రంలో కూడా ఇంత బేజారెత్తిన ప‌రిస్థితి టీడీపీ ఎన్న‌డూ క‌నిపించ లేదు. కానీ, నేడు మాత్రం అంత‌కు మించి అనే రేంజ్‌లో టీడీపీలో బేజారు రాజ‌కీయాలు పెరిగిపోయాయి. పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఇక‌, ఫ్యూచ‌రే లేద‌న్న‌ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రిదారి వారు చూసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లై రెండు మాసాలు పూర్త‌యింది. అయితే, ఓడిపోయిన కీల‌క నాయ‌కులు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రాలేదు.


అంతేకాదు, వైసీపీ ప్ర‌భుత్వంపై ఒక్క‌మాటంటే ఒక్క మాట కూడా అన‌డం లేదు. ఈక్ర‌మంలో అస‌లు వారు పార్టీలో ఉంటారా?  లేక వేరే దారి చూసుకుంటారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఇటీవ‌ల కొన్నాళ్లుగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు రాజ‌కీయాలు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. టీడీపీలో ఆయ‌నో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు సాధించారు. అసెంబ్లీలోను, బ‌య‌ట కూడా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. 


2014లో ఎంత భారీ మెజారిటీతో విజ‌యం సాధించారో.. తాజా ఎన్నిక‌ల్లో అంత అత్యంత త‌క్కువ ఓట్ల తేడాతో నే ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ఆయ‌న కొన్నాళ్లుగా పార్టీపై అల‌క‌బూనార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి జారుకుంటార ని, ఇప్ప‌టికే చ‌ర్చలు కూడా పూర్త‌య్యాయ‌ని, ఆయ‌న‌కు జ‌గ‌న్ రెడ్ కార్పెట్ కూడా ప‌రిచార‌ని అంటున్నారు. అయితే, దీనిపై క్లారిటీ కోసం చంద్ర‌బాబు ఇప్ప‌టికే ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌ను రంగంలోకి దింపారు. ఆయ‌న రాయ‌బారం క‌లిసి వ‌స్తుందో రాదో ఇంకా స‌స్పెన్స్‌లోనే ఉంది. 


అయితే, ఒక‌వేళ బొండా ఇక్క‌డ నుంచి త‌ప్పుకొంటే.. సెంట్ర‌ల్‌లో టీడీపీ ప‌రిస్తితి ఏంటి? వ‌్య‌క్తి రాజ‌కీయాల‌కు పెద్ద‌పీట వేసే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల‌తో సంబంధం లేకుండా వ్య‌క్తుల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బొండా క‌నుక త‌ప్పుకొంటే.. ఇక్క‌డ నుంచి ఎవ‌రు టీడీపీ త‌ర‌ఫున ఎలివేట్ అవుతారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఈ క్ర‌మంలో వినిపిస్తున్న మ‌రోపేరు.. వంగ‌వీటి రాధా. ఈయ‌న కూడా టీడీపీలో ఉన్న‌వారే. ఎన్నిక‌ల‌కు ముందు టికెట్ విష‌యంపై వైసీపీతో పెనుగులాడి చివ‌రికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 


అయితే, ఈయ‌న‌కు కాపుల నుంచి పెద్ద‌గా అండా దండా కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న వ‌చ్చినా.. ఇక్క‌డ పెద్ద‌గా పుంజుకునే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఇక్క‌డే ఇంకో విష‌యం కూడా ఉంది. ఈయ‌న కూడా పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ఇదే జ‌రిగితే.. ఇక‌, సెంట్ర‌ల్‌లో టీడీపీ జెండా మోసే నాయ‌కుడు కూడా ఉండ‌ర‌ని నిపుణులు చెబుతున్నారు. బొండా వెళ్లినా వంగ‌వీటికి ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించినా ఒరిగేదేం ఉండ‌ద‌ని ఆ పార్టీ నేత‌లే చెపుతున్నారు. ఏదేమైనా బొండా పార్టీ మార్పు ఇప్పుడు బెజ‌వాడ పాలిటిక్స్‌లో గంద‌ర‌గోళంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: