ఏపీలో గత సార్వత్రి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏకంగా 175 అసెంబ్లీ సీట్లలో 153 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది. 25 ఎంపీ సీట్లలో 22 స్థానాలు గెలుచుకుంది. జగన్ విజయం సాధిస్తాడని ఎన్నికలకు ముందే ఎంతో మంది విశ్లేషకులు, ఎన్నికల సర్వేలు చెప్పాయి. అయితే ఈ స్థాయిలో ఘన విజయం సాధిస్తాడని మాత్రం ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు.


చివరకు వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోయే రేంజ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. లగడపాటి వంటి సర్వే పండితులు సర్వే సన్యాసం చేయాల్సి వచ్చింది. మరి జగన్ ఇంతగా విజయం సాధించడానికి కారణం ఏంటి.. ఇందుకు అనేక మంది అనేక విశ్లేషణలు ఇచ్చారు. అయితే అసలు విజేత జగన్ మాత్రం తన విజయం గుట్టు ప్రత్యేకంగా ఎప్పుడూ విప్పి చెప్పేలేదు.


ఆయన సీఎం అయిన రెండు నెలల తర్వాత తాజాగా జరిగిన జయహో పుస్తకావిష్కరణ సభలో ఈ విజయ సూత్రం వివరించారు. జగన్ పాదయాత్రపై రాసిన సంకలనమే ఈ జయహో పుస్తకం. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తన విజయం గురించి జగన్ అద్భుతంగా వివరించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 3648 కిలో మీటర్లు పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే ఈ అద్భుత యాత్రను పూర్తి చేయగలిగానని జగన్ అన్నారు.


ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: