గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా ఏజన్సీ ప్రాంతాలు అస్థవ్యస్తమయ్యాయి, గిరిజనుల కన్నీటి సంద్రాలుగా రూపుదాల్చాయి. గూడు కోల్పోయిన గిరిజనుల ఘోష వరద కెరటాలలో హోరులో కలిసిపోయింది. సమాచార వ్యవస్థకు అక్కడ ఎలాగూ అవకాశంలేదు, కనీసం విద్యుత్తు పునరుద్దరణ కూడా జరగలేదు. 15 రోజులుగా అందకారంలో మగ్గుతున్నారు. ప్రభుత్వం అందించే వరద సహాయం రెండు రోజుల ఆలస్యంగా చేరడంతో అప్పటి వరకూ అర్ధాకలితోనే కాలం వెల్లదీశారు. వరద ఉప్పెన కొన్ని గ్రామాల్లోని ఇళ్లల్లోనికి చొరబడటంతో ప్రాణాలరిచేత పట్టుకుని పరుగులు తీశారు. ఉన్నతాధికారులెవ్వరూ  ఆ గ్రామాలను ఇప్పటికీ పరిశీలించిన దాఖలాల్లేవు. 12 గ్రామాల సముదాయమైన కొండమొదలు పంచాయితీ ప్రజల వేదన వర్ణనాతీతం. తమను కనీసం మనుషులుగా కూడా గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


వరదలు సంభవించి 15రోజులు పైగా గడచినప్పటికీ ఈ ప్రాంతాన్ని ఐటీడీఏ అధికారులుగాని, జిల్లా ఉన్నతాధికారులుగాని పరామర్శించలేదని, వారి యోగక్షేమాల కోసం పట్టించుకోలేదని ఆ ప్రాంత పరిశీలనకు వెల్లిన రైతుకూలి సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. గిరిజనులు నివసించేందుకు బరకాలు (టార్పాలిన్స్‌) అందజేస్తామని చెప్పి ఎనిమిది కుటుంభాలకు ఒకటి చొప్పున ఇస్తామనడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రభుత్వాధికారులను ప్రశ్నించారు. కటిక చీకటిలో మగ్గుతున్న గిరిజనులకు సోలార్‌ లైట్లు సరఫరా చేస్తామన్నారే తప్ప ఇప్పటి వరకూ ఇచ్చిన దాఖలాల్లేవని దుయ్యబట్టారు. 25 కేజీల బియ్యం, 3 కిలోల బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, 3లీటర్ల కిరోసిన్‌ ఇచ్చినంత మాత్రాన వారు ఎలా వంట చేసుకోగలుగుతారని ప్రశ్నించారు. 


కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన కొండమొదలు పంచాయి గ్రామాల సమావేశంలో రైతుకూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కొండమొదలు మాజీ సర్పంచ్‌ ఇళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ గోదావరి ఉదృతికి లోతట్టు ప్రాంతంలోని పంటపొలాల్లో నీరు నిలిచిపోయిందని, ఇక్కడి గిరిజనులు గత 15 రోజులుగా వ్యవసాయ పనులు కోల్పోయారని తెలియజేశారు. కిర్లంపూడి మండల వ్యవసాయ శాఖకు చెందిన ఇద్దరు క్షేత్ర స్థాయి వ్యవసాయ అధికారులను వరద సహాయక పర్యవేక్షకులుగా పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారని రామిరెడ్డి ఆరోపించారు. వరదలు సంభవించిన అనంతరం అన్ని దారులు మూసుకుపోవటంతో రెండు రోజుల పాటు కొండమొదలు పంచాయితీ పరిదిలోని గిరిజనులు ఆకలితో గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు.  


పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతాల్లో కొండమొదలు పంచాయితీ కూడా ఉందని, అయితే ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ఫ్యాకేజ్‌కి సంభంధించి ఇక్కడ గిరిజనులకు స్పష్టత ఇవ్వడంలేదని స్థానికుడు, అడ్వకేట్‌ కె జోగారావు ఆరోపించారు. 18 సంవత్సరాలు నిండినవారిలో చాలా మందికి ఈ ఆర్‌ అండ్‌ ఆర్‌ వర్తింపచేయటంలేదని, అదే విధంగా 55 సంవత్సరాలు నిండినవారికి కూడా ఈ ఫ్యాకేజ్‌ వర్తింపచేయకపోడంతో తీవ్ర గందరగోళం ఇక్కడ నెలకొందన్నారు. కొండలు, అటవీ ఉత్పత్తులు, వ్యవసాయంతో గిరిజనుల జీవిన విధానం ముడిపడి ఉందని, పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో చుట్టుపక్కల పంచాయితీలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. 


ఆర్‌ అండ్‌ ఆర్‌ ఫ్యాకేజ్‌ పట్ల ప్రభుత్వం గిరిజనులను గందరగోళానికి నెట్టడంతో పాటు పునరావాసం కల్పనలో కూడా ప్రభుత్వానికి చిత్తశుద్దిలేదని తాజా మాజీ సర్పంచ్‌ వేట్ల విజయ ఆరోపించారు. పునరావాసం పేరుతో నిర్మితమవుతున్న ఇళ్లలో నాణ్యత లేదని, అవి ఎప్పటికైనా ప్రమాదమేనని విమర్శించారు. స్వాతంత్య్రం సిద్దించి 72 ఏళ్లు గడచినప్పటికీ సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేయలేకపోయారని అటువంటి వారు ఆర్‌ అండ్‌ ఆర్‌ ఫ్యాకేజ్‌లో అంకితభావం చూపుతారంటే నేతిబీరలో నేయి చందమేనని ఎద్దేవా చేశారు. గిరిజనులను ఇప్పటికీ మనుషులుగా చూడటంలేదని, వారి సంక్షేమం కోసం సంక్షేమ శాఖలు పెట్టడం తప్ప వాస్తవంలో సంక్షేమ కార్యాచరణ శూన్యమవుతోందని దుయ్యబట్టారు. 


ఇదిలా ఉండగా కొండమొదలు పంచాయితీ పరిధిలోని గ్రామాలు, వాటి స్థితిగతులను పరిశీలిస్తే... 
తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల ఏజన్సీ ప్రాంతం కొండమొదలు పంచాయితీ. ఈ పంచాయితీకి ఒక పక్క మంటూరు పంచాయితీ, మరో పక్క దేవీపట్నం పంచాయితీలున్నాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతం కావటంతో దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో గిరిజన తెగకు చెందినవారు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కొండమొదలు పంచాయితీ పరిధిలో 12 గ్రామాలున్నాయి. అవి పెద్దగూడెం, కోమనమెట్ట, తడివాడ, కొక్కెరగూడెం, కొండమొదలు, సోమన్నపాడు, నడిపూడి, తెలిపేరు, తాళ్లూరు, బడిగుంట, మట్టగూడెం, కొత్తపల్లి. ఈ 12 గ్రామాలలోని 11 గ్రామాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. గోదావరి వరద నీరు ఇళ్ల మధ్యకు రావటంతో వారంతా మెట్ట ప్రాంతానికి తాత్కాలికంగా తలదాచుకునేందుకు వెళ్లారు. కొండమొదలు పంచాయితీ పరిధిలోని 12 గ్రామాల్లో సుమారు 3000 మంది జనాభా, 1500 ఓటర్లు ఉన్నట్టు అక్కడి తాజా మాజీ సర్పంచ్‌ వేట్ల విజయ తెలియజేశారు.


కొండమొదలు పంచాయితీ పక్క పంచాయితీ అయిన మంటూరులోని మూడు గ్రామాలు, దేవీపట్నంలోని 6 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఈ మూడు పంచాయితీల్లోనూ గిరిజనులు తమ జీవనోపాదిని కోల్పోయారు. కొందరు ఇప్పటికీ ఇళ్లకు చేరుకోగలిగే పరిస్థితిలేదు. కొత్తగూడెంలోని రెండు ఇళ్లు పూర్తిగా ద్వంసమయ్యాయి. ఏటా గోదావరి నీరు తమ ఊళ్లను ముంచెత్తుతోందని స్థానికురాలు  టి చిన్నమ్మ తెలియజేశారు. 1986లో వచ్చిన వరదలకు మొత్తంగా తమ గ్రామాలు నీట మునిగిపోయాయని గుర్తుచేసుకున్నారు. ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టినప్పటి నుంచీ మరలా గోదావరి వరద నీరు గ్రామాల్లోనికి చేరుతోందని తెలిజేశారు. ఏటా వరదలు వచ్చినప్పుడు సుమారు మూడు నెలల పాటు జీవనోపాధి ఉండదని, అధికారులు కూడా తమను పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 


వరదలు సంభవించినప్పడు చుట్టుపక్కల పంచాయితీలతో సంబంధాలు తెగిపోతాయని కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కె పాపారావు వాపోయారు.  గోదావరిలో 2018లో బోటు దగ్ధమైనప్పటి నుంచీ లాంచి ప్రయాణానికి నిబంధనలు విధించడంతో పాటు లాంచిలు రద్దు చేయటంతో వీరు ఈ గ్రామాల నుంచి అటు రాజమండ్రి, ఇటు కాకినాడకు వెళ్లాలంటే సాహసోపేత ప్రయాణం చేయక తప్పడంలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి లాంచి ప్రయాణం నిలిచిపోడంతో మరొక ప్రత్యామ్నాయ మార్గమైన కాకవాడ రోడ్డు మీదిగా రంపచోడవరం మార్గాన్ని అనుసరించక తప్పడంలేదని పాపారావు తెలియజేశారు.

రంపచోడవరం మండలం నుంచి సుమారు 42 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండమొదలు ప్రాంతానికి చేరుకోవాలంటే రెండు పెద్ద కొండలు, మరొక చిన్న కొండ ఘాటీలు ఎక్కి వెళ్లాల్సిందేనంటున్నారు. అంతేకాకుండా ఈ మార్గం మధ్యలో రెండు పెద్ద వాగులను దాటాల్సి ఉంటుంది. వాటితో పాటు సుమారు 23 చిన్నవాగులు మార్గంలోనే రహదారి మార్గంలో ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం నుంచి కాకవాడ వరకూ సుమారు 13 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్డును ప్రభుత్వం నిర్మించింది. అక్కడ నుంచి కొండమొదలు వరకూ మట్టిరోడ్డే శరణ్యమంటున్నారు. వర్షం వస్తే ఈ మార్గంలో ప్రయాణం జీవన్మరణ సమస్యగా ఉంటుందని వాపోతున్నారు. 


ఈ మార్గంలో అక్కడక్కడా వేసిన గ్రావెల్‌ మట్టి వాగుల ప్రవాహంతో బురదగా మారుతోంది. ఫలితంగా ద్విచక్ర వాహనాలు సైతం ప్రయాణించేందుకు అనుకూలత ఉండటంలేదు. మరికొన్ని చోట్ల మార్గం మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో ఆటో ప్రయాణం సాహసోపేతంగా మారుతోంది. ఘాటీ మార్గంలో ఎటువంటి రక్షణ ఏర్పాట్లను ప్రభుత్వంగాని, ఐటిడీఏ అధికారులు గాని చేపట్టలేదు. ఈ ఘాటీ మలుపుల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా సుమారు 20 మీరట్ల లోతు లోయలో పడిపోవటం ఖాయం. దట్టమైన అటవీ ప్రాంతమైన ఈ మార్గంలో ఏ ఒక్కరూ ఒంటరిగా వెళ్లేందుకు సాహసించలేరు. ఇక్కడ పులులు, సింహాల సంచారం ఉన్నట్టు వన్యప్రాణి సంరక్షణ విభాగం బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే అవి మినహా మిగిలిన అడవిజంతువులు ఉండవచ్చని గిరిజనులు చెబుతున్నారు. కాగా పాముల సంచారం ఈ మార్గంలో ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. 


ఆరోగ్య సేవలు కూడా ఇక్కడ అంతంత మాత్రమేనని చెబుతున్నారు. ఎందుకంటే కొండమొదలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్‌ రంపచోడవరం నుంచి వస్తుంటారని, సాహసోపేత ప్రయాణం చేయలేక కొన్ని రోజులు మాత్రమే వస్తంటారని వెల్లడించారు. కాగా వరదలు సంభవించిన అనంతరం ఒకటి రెండు సార్లు రెండు పెద్దవాగులు దాటి, మెలలోతు నీటిలో నుంచి నడచి వచ్చి వైద్య సేవలందించినట్టు చెబుతున్నారు. వైద్య సహాయక సిబ్బందిలో కొందరు స్థానికులే ఉండటంతో వైద్య సేవలు కొంతమేరకు అందుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా వరదలు వచ్చి తగ్గిన అనంతరం ఏజన్సీ ప్రాంతాల్లో అంటురోగాలు ప్రభలుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఇక్కడ వైద్య బృందాలను నియమంచి సీజనల్‌ వ్యాధులు, అంటురోగాలు ప్రభల కుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: