ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక వెలుగు వెలిగి పోవచ్చునని భావించిన  నందమూరి లక్ష్మీపార్వతి ఆశలు  అడియాసలు  అయినట్లు కన్పిస్తున్నాయి .  వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున గొంతును వినిపించిన పలువురు నాయకులకు  ఇప్పటికే నామినేటెడ్ పదవులు దక్కగా , లక్ష్మీపార్వతి మాత్రం పార్టీ నాయకత్వం ఎటువంటి ఆఫర్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవని తెలుస్తోంది.  ప్రస్తుతానికి ఈమెకు  ఎటువంటి పదవి దక్కలేదు సరికదా ... భవిష్యత్తు లో  దక్కుతుందన్న ఆశలు కూడా కన్పించడం లేదని వైకాపా వర్గాలు అంటున్నాయి .


అసెంబ్లీ  ఎన్నికల ముందు తన అల్లుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పై ఒంటి కాలిపై లేస్తూ విమర్శలు గుప్పించిన  లక్ష్మీ పార్వతి కి, పార్టీ  అధికారంలోకి రాగానే మంచి పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు.  కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,  లక్ష్మీపార్వతి ఇప్పటి వరకూ ఎటువంటి నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ కూడా ఇవ్వలేదని వైకాపా వర్గాలు చెబుతున్నాయి . దానికి తోడు పార్టీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు లక్ష్మీ పార్వతి కి అధిక ప్రాధాన్యతనిచ్చిన వైకాపా నాయకత్వం , ప్రస్తుతం ఆమెకు   సరైన ప్రాధాన్యతను  కూడా ఇవ్వడం లేదని  పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీపార్వతిని అధికార  తెలుగుదేశం పార్టీని విమర్శించేందుకు ఉపయోగించుకున్న  వైకాపా నాయకత్వం ప్రస్తుతం ఆమె అంటే  అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది . లక్ష్మీ పార్వతికి అంతగా ప్రాధ్యానత ఇవ్వకపోవడానికి ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఎపిసోడే కారణమని తెలుస్తోంది . దాని కారణంగానే ఆమెకు నామినేట్ పదవి ఇవ్వకుండా హోల్డ్ లో ఉంచారని  సమాచారం . రానున్న రోజుల్లో లక్ష్మీ పార్వతి సేవలు యధావిధిగా  పార్టీ నాయకత్వం ఉపయోగించుకుంటుంది ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పుకొచ్చారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: