అవును చంద్రబాబునాయుడును సీనియర్ నేతలు వెనక్కు లాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయాలని నేతలకు, క్యాడర్ కు చంద్రబాబు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడే చంద్రబాబు ఆలోచనలతో కొందరు సీనియర్ నేతలు విభేదిస్తున్నారు.

 

ఐదేళ్ళ పాలనలో ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా జనాలు ఓడించిన విషయాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంటి కొందరు నేతలు చంద్రబాబుకు గుర్తు చేశారు. పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే టిడిపి ఆందోళనలు చేస్తే బావోదని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ’మన ప్రభుత్వం ఇంత చేసినా జనాలు పట్టించుకోకుండా జగన్ కు బ్రహ్మాండమైన మెజారిటి ఇచ్చిన తర్వాత మనం ఎంత ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండద’ని స్పష్టంగా చెప్పారు.

 

పైగా జగన్ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిన కారణంగా ఇప్పటికిప్పుడు నిరసనలు, ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండదని కూడా చింతకాయల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. చంద్రబాబుతో పాటు చాలామంది సీనియర్ నేతలు వేదిక మీద ఉండగానే చింతకాయల తన అభిప్రాయాలను చెప్పటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

సో, జరిగినదాన్ని బట్టి అర్ధమవుతున్నదేమిటంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి ఆందోళనలు చేయటం చాలామంది సీనియర్లకు పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ఇంకా ప్రభుత్వంలో సరిగా కుదురుకోనే లేదు. అధికారంలో వచ్చిన 60 రోజుల్లో 25 రోజులు అసెంబ్లీ సమావేశాలతోనే సరిపోయింది. మిగిలిన 35 రోజులు వివిధ శాఖలతో సమీక్షలని, ఉన్నతాధికారులతో సమావేశాలని, రెండుసార్లు ఢిల్లీ పర్యటనలు, రెండుసార్లు వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్ళటంతోనే సరిపోయింది.

 

అదే సమయంలో చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా వైసిపి ప్రభుత్వంలో అరాచకాలేమీ జరగటం లేదు. టిడిపి నేతలపై దాడులూ జరగటం లేదు. ఎక్కడైనా జరిగినా అవి వ్యక్తిగత కక్షలతో జరిగినవే. హోలు మొత్తం మీద అసలు విషయం ఏమిటంటే జనాలకు ఎవరికి ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. ఆ విషయాన్నే చింతకాయల స్పష్టంగా చెప్పారు. మరి ఇపుడు చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: