సరిగ్గా సమయం చూసి మరీ చంద్రబాబునాయుడును జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొడుతున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల నియామకాలను పూర్తి చేయటం ద్వారా పార్టీని గ్రామీణ స్ధాయిలో బలోపేతం చేయాలన్నది జగన్ ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేది ఇదే కాబట్టి జగన్ చేసేదానిలో తప్పేమీ లేదు.

 

ఇదే పనిని అధికారంలో ఉన్నపుడు జన్మభూమి కమిటిల పేరుతో చంద్రబాబు కూడా చేశారు. కాకపోతే జన్మభూమి కమిటిలు ఓ మాఫియా లాగ తయారవ్వటంతో పార్టీకి తీరని నష్టం జరిగింది. సరే అసలు విషయానికి వస్తే గ్రామసచివాలయాల్లో భర్తీ చేయబోయే ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల నియామకాలను రాజకీయంగా వ్యతిరేకించాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపిచ్చారు. అయితే అందుకు నేతలు వెనకాడుతున్నారు. గ్రామ సచివాలయాలు కానీ గ్రామ వాలంటీర్ల వ్యవస్ధ కానీ అమల్లోకి వస్తే సుమారు 4.5 లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు వస్తాయి.

 

ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాటిని రాజకీయ కోణంలో టిడిపి నేతలు విమర్శించినా, ఆరోపించినా జనాలు తమపై తిరగబడే అవకాశాలే ఎక్కువున్నట్లు నేతలు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతోనే నేరుగా చెప్పేశారని సమాచారం. ఇక ఈ ఏడాదిలోనే స్ధానిక సంస్దల ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచు నుండి ఎంపిటిసి, జడ్పిటిసిలతో పాటు మున్సిపాలిటి ఎన్నికలు కూడా వరసగా జరపాలని జగన్ నిర్ణయించారు.

 

అంటే ఎన్నికలకంటే ముందే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఒకేసారి ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత జరిగే ఎన్నికల్లో సహజంగానే గ్రామస్ధాయి నుండి మున్సిపల్ స్ధాయి వరకూ అధికారపార్టీ వైపే జనాలు మొగ్గు చూపే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆందోళన పడుతున్నారు. అంటే మొన్న సాధారణ ఎన్నికల్లో దెబ్బ తిన్నట్లే రేపు స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టిడిపికి చావు దెబ్బ తప్పదనే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: