తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మ‌రోమారు త‌న మంచి మ‌న‌సును చాటుకున్నారు. కేటీఆర్‌ మంచి మనసు ఫలితంగా 4వ తరగతి చదువుతున్న ఒక బాలుడు తన అంగవైకల్యాన్ని జయించాడు. ఆపదలు, అవసరాల్లో ఉన్న వారికి ఒక్క మాట దూరంలో ఉండే కేటీఆర్ కృషి ఫలితంగా గోదావరిఖనికి చెందిన సాయిరాం అనే బాలుడు తన అంగవైకల్యము వలన పడుతున్న కష్టాలు దూరం అయ్యాయి. సాయిరాంకి అవసరమైన శస్త్రచికిత్సను కేటీఆర్ దగ్గరుండి చేయించడం జరిగింది. 


పెద్ద‌ప‌ల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయిరాం 4వ తరగతి చదువుతున్నాడు. అయితే చిన్నప్పుడు వచ్చిన పోలియో వ్యాధి ఫలితంగా తన రెండు కాళ్లు వంకరగా ఉండటం వలన నడవలేని పరిస్థితి ఏర్పడింది. తన తల్లిదండ్రులు రాజమల్లు, లక్ష్మిలతో కలిసి ఈ సంవత్సరం జనవరి మాసంలో కేటీఆర్‌ను కలిసి సహాయం అందించాల్సిందిగా కోరడం జరిగింది. తనను కలిసిన సాయిరాంకు పూర్తిస్థాయిలో శస్త్ర చికిత్సలు చేసి తగిన సహాయం అందించాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సీనియర్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌కు కేటీఆర్ బాధ్యతలు అప్పగించారు.దీంతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన ఆర్థిక సాయాన్ని సైతం కేటీఆర్ అందించడం జరిగింది. నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో సాయిరామ్ ను తీసుకెళ్లి అక్కడ ఆయన కాళ్ళకి అవసరమైన శస్త్రచికిత్సను చేయడంతో ప్రస్తుతం బాలుడు సరిగ్గా నడవ గలుగుతున్నాడు.


శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న సాయిరాం తన తల్లిదండ్రులతో కలిసి ఈ రోజు కేటీఆర్ ను బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాయిరాం సాధారణ స్థితికి రావడం చూసిన కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సాయిరాం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. తన కొడుకు అంగవైకల్యాన్ని జయించే లా అన్ని రకాల సహాయం అందించిన కేటీఆర్ కి సాయిరాం తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. తన అంగవైకల్యాన్ని జయించిన సాయిరాం ప్రస్తుతం అందరి లాగే నేను నడవ గలుగుతున్ననంటూ సంతోషం వ్యక్తం చేసి, కేటీఆర్ ముందు నడిచి మరి చూపించాడు. సాయిరామ్ కి ఇంకేదైనా అవసరం వస్తే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా ఉంటార‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.


కాగా,  సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయిరాం కాళ్లకు ఆపరేషన్ పూర్తయి..అతను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ ఏడాది జనవరిలో సాయిరాం అనే బాలుడిని రామగుండం ఎమ్మెల్యే చందర్ నా దగ్గరకు తీసుకొచ్చారు. ఎముకల్లో లోపం వల్ల దొడ్డి కాళ్లతో నడవలేని స్థితిలో ఉన్న సాయిరాంకు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత సాయిరాం అందరిలా సాధారణంగా నడవగలుగుతున్నాడు. సాయిరాంకు అండగా నిలిచిన సీఎంఆర్ఎఫ్ కు ధన్యవాదాలు. సాయిరాంతో గడిపిన క్షణాలు మంచి జ్ఞాపకాలు’గా ఉంటాయని కేటీఆర్ ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: