ముఖ్యమంత్రిగా పాలన బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తనదైన ముద్ర చూపించేందుకు జగన్ తహతహలాడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన మొదటగా ప్రారంభిస్తున్న కార్యక్రమం.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పటికే ఈ వాలంటీర్ల నియామకాలు పూర్తయ్యాయి. లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఈ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.


నెలకు 5 వేల రూపాయల వేతనం.. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం. ఇప్పుడు గ్రామ పాలనలో, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఈ వాలంటీర్లు కీలక పాత్ర పోషించబోతున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకం ఒక రికార్డుగానే చెప్పాలి. 40 రోజుల వ్యవధిలో కేవలం 2.5 లక్షలమందిని నియమించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న విజయవాడ, గుంటూరులలో ప్రారంభిస్తున్నారు. మండల స్థాయిలో ఎమ్మెల్యేలు, మండలస్థాయి అధికారులు ప్రారంభిస్తారు.


వాలంటీర్లు చేయాల్సిన పనులపై షెడ్యూల్‌ తయారుచేశారు. ఆగస్టు 16 నుంచి 23 వరకూ వారికి కేటాయించిన కుటుంబాలను పరిచయం చేసుకుంటారు.గ్రామవాలంటీర్లు సెప్టెంబరు 1 నుంచి సెప్టెంబరు 10 వరకూ బియ్యం, పెన్షన్లు డోర్‌ డెలివరీ చేస్తారు. పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన, ప్యాకేజ్‌ చేసిన బియ్యం పంపిణీని శ్రీకాకుళంలో ప్రారంభిస్తున్నారు. తర్వాత మిగిలిన జిల్లాల వర్తింపచేస్తారు. సెప్టెంబరు 11 నుంచి 15 వరకూ పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్లస్థలాలు, రైతు భరోసా లబ్ధిదారులను వాలంటీర్ల గుర్తిస్తారు. త్వరలోనే మత్స్యకారులు, రజకులు, ఆటోడ్రైవర్లు, టైలర్లకు, నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన పథకాలకు అర్హులైన వారిని వాలంటీర్లు గుర్తించే కార్యక్రమం చేపడతారు.


గ్రామ వాలంటీర్లకు ఒక్కొక్కరికి 50 కుటుంబాలను కేటాయించారు. ఈ 50 కుటుంబాల బాధ్యత ఆ గ్రామ వాలంటీరే చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే.. వైసీపీ వారినే వాలంటీర్లుగా నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు విధుల్లో పక్షపాతం లేకుండా వ్యవహరిస్తే.. జగన్ సర్కారుకు మంచి పేరు తెచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: