రాజ‌కీయాల్లో నాయ‌కుల‌కు సంయ‌మ‌నం అవ‌స‌రం. ముఖ్యంగా ఎదుగుతున్న పార్టీల్లో ఇది మ‌రింత అవ‌స‌రం. మ‌రి ఈ విష‌యం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌కు తెలియ‌ద‌ని అనుకోలేం. కానీ, ఆయ‌న చాలా స్పీడ్ అవుతున్నారు. నేత‌ల‌పైనా, కార్య‌క‌ర్త‌లపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజానికి ఒకింత వనిశితంగా గ‌మ‌నిస్తే.. ప‌వ‌న్‌లో ఓట‌మి తాలూకు ఆవేద‌న ఇంకా పోలేద‌ని అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప‌వ‌న్.. జిల్లాల వారీగా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కూడా పార్టీ ప‌రిశీల‌న‌, ద‌శ దిశ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు కాకినాడ, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాలను సమీక్షించారు. తాజాగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధి నాయకులతో సమావేశమయ్యారు.  


ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కొంచెం దూకుడుగానే మాట్లాడార‌ని అంటున్నారు. కార్యక‌ర్త‌లు, నేత‌లు ఇంకా పూర్తిస్థాయిలో ఏర్ప‌డ‌ని పార్టీని ఆయ‌న ఐదేళ్ల‌పాటు న‌డిపించాల‌నే విష‌యాన్ని గ‌మ‌నించ‌కుండానే.. ఆయ‌న ఉంటే ఉండండి.. లేదంటే పోండి అని కొంత క‌ర్క‌శంగానే మాట్లాడారు. దీనంత‌టికీ రీజ‌న్ ఒక్క‌టే.. సోష‌ల్ మీడియాలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌పై వ‌స్తున్న వ్యాఖ్య‌లు, కామెంట్లే కార‌ణంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఆయ‌న పార్టీని విలీనం చేస్తార‌ని త‌ర‌చుగా వార్త‌లు హోరెత్తుతున్నాయి. వీటిని సంయ‌మ‌నంతో స్వీక‌రించి త‌న స‌మాధానం చెప్పాల్సిన ప‌వ‌న్‌.. వాటిని ఆస‌రా చేసుకుని నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను హెచ్చ‌రిస్తున్న స్వ‌రంతో మాట్లాడారు. ప‌ద‌వుల కోసం పార్టీ పెట్ట‌లేద‌ని చెబుతారు. కానీ, తాను రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేయాల్సి వ‌చ్చింద‌నే విష‌యాన్ని మాత్రం దాట వేస్తారు. 


అదేస‌మ‌యంలో తాను ముఖ్యమంత్రిని కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో రాజకీయ పార్టీని స్థాపించానని అన్నారు. ప్రాంతీయంగా పుట్టిన పార్టీ అయినప్పటికీ..జాతీయవాదాన్ని వినిపించేలా తయారు చేశామని అన్నారు. మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లే పార్టీ అని అభివర్ణించారు.  అయితే, ఈ సంద‌ర్భంగానే ఆయ‌న సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఆగ్రహాన్ని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అగ్ర నాయకత్వం తీసుకునే నిర్ణయా లకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాము తీసుకునే నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత సమయంలో కార్యాలయాలకు వచ్చి, వాటిని వ్యక్తీకరించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. 


రోడ్లెక్కినట్లు సోషల్ మీడియా ఎక్కితే నిర్ణయాలు వెనక్కి తీసుకోన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.  పార్టీ తీసుకునే కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలను గౌరవించాల్సిందేనని అన్నారు. రాజకీయాల్లో చాలా మందికి భావోద్వేగాలు, ఆవేశం ఎక్కువ ఉంటాయని, ఒక్కోసారి నాతో సహా నాయకులందరినీ తిడుతుంటారని అన్నారు. రాజకీయాల్లో మాట నియంత్రణ, సమన్వయం చాలా అవసరమన్నారు. క‌ట్ చేస్తే.. నేటి రాజ‌కీయాల్లో ఇలాంటివి ఉంటాయ‌ని అంటే క‌ష్ట‌మే. అయినా.. ఇన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌లు గీస్తే.. పార్టీలోకి వ‌చ్చేవారెవ‌రు.?  పార్టీ జెండా మోసేదెవ‌రు? మ‌రి ఈ విష‌యాల‌పైనా ప‌వ‌న్ క్లారిటీగా ఉంటే మేల‌ని సూచిస్తున్నారు ప‌రిశీల‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: