కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలన్న పాకిస్తాన్, చైనా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఐక్యరాజ్యసమతి సాక్షిగా ఈ రెండు దేశాలకు భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం.. పాక్, చైనా అంచనాలకు భిన్నంగా సాగింది. భారత్ ను ఇరుకున పెట్టాలన్న ఈ రెండు దేశాల కుట్రలు సాగలేదు.


పాక్ కు కేవలం చైనా తప్ప ఏ ఇతర దేశమూ మద్దతుగా నిలవలేదు. దీనికి తోడు అమెరికా వంటి బలమైన దేశాలు ఇండియా వాదనకే మద్దతుగా నిలిచాయి. దీంతో ఈ రహస్య సమావేశం కుట్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ అంశంపై సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా వాదనను అమెరికా తిప్పి కొట్టింది.ఇది భారత్, పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన సమస్య అని తేల్చి చెప్పింది.



ఈ మీటింగ్ పూర్తయిన తర్వాత పాక్, చైనా ప్రతినిధులు కనీసం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయాయంటే... వాటికి ఎంతగా పరాభవం ఎదురైందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని తేల్చి చెప్పాయి. అంతేకాదు.. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించాలని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు ఖండించాయి.


370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనకు కూడా ఏమాత్రం మద్దతు లభించలేదు. చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడర్‌ ద్వారా కూడా మార్పులు వస్తున్నాయి కదా.. దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశాయి. మీకు అంతగా అనిపిస్తే... చైనా తరపున ఓ ప్రకటన చేసుకోమని సలహా ఇచ్చాయి. దీంతో పాక్, చైనా పప్పులు ఈ సమావేశంలో ఉడకలేదు. పాకిస్తాన్ ను అడ్డుపెట్టుకుని భారత్ ను దెబ్బ తీయాలన్న చైనా ప్రయత్నం మరోసారి ఫెయిల్ అవ్వడంతో చైనా పరువు గంగలో కలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: