భూకంపాలు, సునామీలు..అగ్ని పర్వతాలు పేలడం...ఇవి ఇండోనేషియా గురించి ప‌రిచ‌య వాక్యాలు. దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుండంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలా తరచూ ఏదో ఒక రూపంలో ఇక్కడ విధ్వంసం జరుగుతూనే ఉండ‌గా ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. నిత్యం ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే రాజ‌ధాని విష‌యంలో ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు.  అదే దేశ రాజధానిని మార్చేయ‌డం!


పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా జకార్తా సముద్రంలో శరవేగంగా మునిగిపోతోంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం పలుచర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతమున్న పరిస్థితులే కొనసాగితే, 2050 నాటికి నగరంలోని మూడో వంతు ప్రాంతం సముద్రగర్భంలోకి జారిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో రాజధానిని తరలించాలని ఇండోనేసియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు అధ్య‌క్షుడు పార్ల‌మెంటులో ప్ర‌క‌ట‌న చేశారు. ‘దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో దీవిలోని కాళీమంథ‌న్‌కు తరలించేందుకు పార్లమెంటు అనుమతి కోరుతున్నాను`. అని విడోడో తెలిపారు.


ఈ నిర్ణ‌యం తీసుకునే ముందు ఇండోనేషియా ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. జవా సముద్రం ఆటుపోట్లను అడ్డుకునేలా ఓ పొడవైన గోడతో పాటు కృత్రిమ దీవులను నిర్మించాలని అధ్యక్షుడు జోకో విడోడో ప్రతిపాదించారు. ఇందుకు రూ.2.84 లక్షల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులోభాగంగా ఇప్పటివరకూ 32 కిలోమీటర్ల మేర భారీ సముద్రపు గోడను, 17 కృత్రిమ దీవులను నిర్మించారు. అయితే ఇది సమస్యకు అనుకున్న పరిష్కారం చూపలేకపోయింది. ఈ భారీ సముద్రపు గోడ నుంచి చాలాచోట్ల నీరు ఊరటం ప్రారంభమైంది. మరికొన్ని  చోట్ల ఈ గోడే నేలలోకి కుంగిపోవడం ప్రారంభించింది. దీంతో రాజధానిని తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం ఓ అభిప్రాయానికి వచ్చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: