బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడానికి సిద్ధం అయ్యింది.  ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అనేక మందిని ఆకర్షిస్తోంది.  ఒక్క తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా కాంగ్రెస్, జనసేన నుంచి కూడా ఇప్పటికే కొంతమంది బీజేపీలో చేరిపోయారు.  ఇంకా కొందరు చేరేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇదిలా ఉంటె, బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తనకు కలిసి వచ్చిన హిందుత్వ కార్డు ను ప్రయోగించబోతున్నది.  ఇందులో భాగంగానే ఛలో శ్రీశైలంను ప్రకటించింది.  


శ్రీశైలంలో అన్యమతస్తుల ప్రభావం పెరిగిపోతున్నదని, అక్కడ దుకాణాల లైసెన్స్ లను అన్యమతస్తులకు కేటాయిస్తున్నారని చెప్పి బీజేపీ వాదిస్తోంది.  ఇందులో భాగంగా ఈరోజు ఛలో శ్రీశైలంను ప్రకటించింది.  దీంతో ఏపి పోలీసులు అలర్ట్ అయ్యారు.  వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.  ఎలాంటి ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని, శ్రీశైలంలో ర్యాలీలు వంటివి చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.  


యాక్ట్ 30 ని అమలు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాళ్లాయపాలెం పీఠాధిపతి శివస్వామికి పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించారు.  ఇక శ్రీశైలం గుడి వద్ద పోలీసులను భారీగా మోహరించారు.  ముందస్తుగా ఎలాంటి ఉద్రిక్తకరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  శ్రీశైలంలో కొత్తగా 200 దుకాణాలను నిర్మించారు. 


వీటికోసం టెండర్లను పిలిచారు.  ఈ టెండర్ల ప్రకారం వీటిలో ఎక్కువ భాగం దుకాణాలను ముస్లిం వర్గాలకు కేటాయిస్తున్నారని బీజేపీ వాదిస్తోంది.  ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే .. శ్రీశైలంలో అన్యమతస్తుల హవా పెరిగిపోతుందని, హిందూ దేవాలయాలపై వారి ఆధిపత్యం పెరుగుతుందని బీజేపీతో సహా హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.  అయితే దుకాణాలను ముస్లింలకు కేటాయించలేదని అధికారులు చెప్తున్నారు.  ప్రస్తుతం శ్రీశైలంలో ఉద్రిక్తత నెలకొనడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: