రాజధాని మార్పు,  పోలవరం రివర్స్ టెండరింగ్,  నవ యువ కాంట్రాక్టు రద్దు వంటి కీలకమైన అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో... అన్ని అంశాలను ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి ,  బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో చర్చించి తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నామని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన తాజా ప్రకటన సర్వత్రా  చర్చనీయాంశంగా మారింది.  అంటే తాము ఏ పీ కి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకున్నా  మోడీ, షా లతో  చర్చిస్తున్నామని  విజయసాయి చెప్పకనే చెప్పినట్లయింది. అయితే విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు .


 పోలవరం ప్రాజెక్టు పనులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దని పోలవరం అథారిటీ చెప్పిన వినకుండా జగన్ సర్కార్ ముందుకు వెళ్లిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు .  ఇక విద్యుత్ ఒప్పందాలను సమీక్షించవద్దని కేంద్రం  లేఖ రాసిన పట్టించుకోలేదన్నారు . ఇక అటువంటప్పుడు కేంద్రం తో చర్చించిన తరువాతే  ఎలా నిర్ణయం తీసుకున్నట్లు అవుతుందని ప్రశ్నించారు .   కేంద్రం వద్దన్నా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ  పనుల్లో  రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం, విద్యుత్ పీపీఏ లను సమీక్షించాలని నిర్ణయించడం తో వైకాపా , బీజేపీ మధ్య గ్యాప్ వచ్చిందన్న వాదనలు విన్పిస్తున్నాయి .


 బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్,  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ సీనియర్ నేతలు  ఆంజనేయరెడ్డి పురంధరేశ్వరి తో పాటు టిడిపి నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి సిఎం రమేష్ వైకాపా  పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు.  రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యి లో పడినట్లయిందని... వైకాపా పాలన కంటే గత టీడీపీ పాలనే బెటరేమోననే అభిప్రాయం కలుగుతోందని రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి .  ఈ పరిస్థితుల్లో   విజయ సాయి చేసిన  వ్యాఖ్యలు ప్రాధాన్యత ను సంతరించుకున్నాయి . 


మరింత సమాచారం తెలుసుకోండి: