రియల్ బూమ్ కోసమే రాష్ట్ర రాజధాని మార్పు అన్న అంశంపై చర్చ జరుగుతుందా? అంటే అవుననే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అమరావతిని కాదని  రాజధానిగా   కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేస్తారంటూ ఊహాగానాలు విన్పిస్తున్న విషయం తెల్సిందే .  విశాఖ లో ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజధాని మార్పు అన్నది ఖాయమ నే  ప్రచారం జోరందుకుంది . అయితే ఇదంతా మైండ్ గేమ్ లో ఒక భాగమేనంటూ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .  కేవలం దొనకొండ ప్రాంతం లో  రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం ఇవ్వడం  కోసమే ఈ తరహా మైండ్ గేమ్ కొనసాగుతోందని అంటున్నారు .


బొత్స వ్యాఖ్యల అనంతరం   అమరావతిని కాదని దేవరకొండ ను రాజధానిగా ఎంపిక చేస్తారంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న  ప్రచారం తో ఇప్పటికే తుళ్లూరు పరిసరాల్లో  రియల్ వ్యాపారం ఢమాల్ మనగా, దొనకొండ ప్రాంతం లో రియల్ బూమ్ జోరందుకుని స్థిరాస్తి వ్యాపార  వర్గాలు అంటున్నాయి. 2014 లో   రాష్ట్ర విభజన అనంతరం   వైకాపా అధికారంలోకి వచ్చి ఉంటే శివరామ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం దొనకొండను  రాజధాని ఎంపిక చేసి ఉండేదని కానీ ,   తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వల్ల అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది రాజకీయ పరిశీలకులు  పేర్కొంటున్నారు.  అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడం తోనే రాజధాని నిర్మాణ పనులన్నీ నిలిపివేసిన విషయం తెల్సిందే.


మొదటి నుంచి అమరావతి ని రాజధాని ప్రాంతంగా వ్యతిరేకిస్తూ వస్తున్న వైకాపా నాయకత్వం  , రాజధాని ప్రాంతాన్ని మారుస్తుందన్న ప్రచార నేపధ్యం లో, అధికారం లోకి రాగానే  రాజధాని నిర్మాణ పనుల నిలిపివేత , తాజాగా బొత్స వ్యాఖ్యల నేపధ్యం లో , ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లయింది. అయితే ఒక్కసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిన తరువాత మార్చడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . అయితే దొనకొండలో తమ సన్నిహితుల భూములకు రెక్కలు వచ్చేలా ఒకవర్గం వారు రాజధాని మార్పు పై పనిగట్టుకుని ప్రచారం చేస్తూ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లు  స్పష్టం అవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: