తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తిరుపతిలో అన్యమతానికి సంబంధించిన టికెట్స్‌ ఎక్కడా సరఫరా చేయలేదు. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నెల్లూరు డిపో నుంచి సంబంధిత టికెట్స్‌ను తెప్పించుకుని తిరుమల బస్సుల్లో ఇష్యూ చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేత   అచ్చెన్నాయుడు అన్నారు.  వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని బహిరంగంగా ఒప్పుకుని విత్‌ డ్రా చేసుకోవడం సరైన పద్ధతి. అలా కాకుండా వైసీపీ తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీపై నిందలు వేస్తోందని విమర్శించారు. 


టీడీపీ హయాంలోనే తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా జరిగాయి. నిత్యాన్నదాన పథకం, తెలుగుగంగ నీరు తిరుమల తరలింపు లాంటివి తెలుగుదేశం పాలనలోనే జరిగాయి. తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలే అంటూ జీవో జారీ చేసింది వైఎస్‌ హయాంలోనే. జగన్‌ ప్రభుత్వ హయాంలోనే శ్రీశైలంలో అన్యమత ప్రచారం చోటుచేసుకుంది.


ఇటీవల విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లి వద్ద గోశాలలో వందకు పైగా గోవులు మృతిచెందడం జగన్‌ ప్రభుత్వ హయాంలోనే చోటుచేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఏ మత విశ్వాసాలకు విరుద్ధంగా వ్యవహరించిన సంఘటన ఒక్కటి కూడా లేదు. వారివారి మత విశ్వాసాలను గౌరవించిన సంప్రదాయం తెలుగుదేశానిది. వైసీపీ ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి భవిష్యత్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా టీడీపీ కోరుతోందని  అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు . 


ప్రస్తుతం తిరుమలలో అన్యమత ప్రచారం విషయం పెద్ద రగడగా మారింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వాపోతున్నారు.  తిరుమలలో ఇలాంటి వాటిని సహించబోమని హిందూ సంస్థలు గట్టిగా చెప్తున్నాయి.  అటు శ్రీశైలంలో కూడా అన్యమత ప్రచారాన్ని, అన్యమతస్తులకు షాపులు కేటాయించడాన్ని అడ్డుకోవాలని చెప్పి హిందూ సంస్థలు పెద్దఎత్తున గొడవ చేసిన సంగతి తెలిసిందే.  ప్రశాంతంగా ఉండే తిరుమల, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి గొడవలు చోటుచేసుకోవడం మంచిది కాదని, దీని వలన సామాన్య భక్తులు ఇబ్బందులు పడతారని భక్తులు ఆవేదన చెందుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: