పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనుల విషయంలోనూ రీ టెండర్‌కు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైడల్‌ ప్రాజెక్టునిర్మాణం కోసం నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఎపిజెన్‌కో జారీ చేసిన ప్రి క్లోజర్‌ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. కొత్తగా టెండరు పిలిచే విషయంలో ముందుకెళ్లవద్దని పేర్కొంది. ఈ మేరకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉత్తర్వుల ప్రభావం మొత్తం ప్రాజెక్టుపై పడుతుందన్న అభిప్రాయం వినిపిస్తుండగా, ప్రభుత్వ వర్గాలు దానిని తోసిపుచ్చుతున్నాయి.


కోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతూనే ఎలా ముందుకు వెళ్లాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. తుది తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతకుముందు పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం విషయంలో నవయుగ కంపెనీ డైరెక్టర్‌ వై.రమేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు గతంలో నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఈ నెల 14న జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలిచ్చారు.


ప్రభుత్వం అర్థంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసిందని, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లే పేరుతో తమ కాంట్రాక్టు రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ తరఫున సీనియర్‌ లాయర్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వద్దని చెప్పిన మరుసటి రోజునే ఒప్పందాన్ని ఏకపక్షంగా ప్రభుత్వం రద్దు చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల నయయుగకు భారీగా ఆర్థిక నష్టం వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.398 కోట్ల మేరకు పనులు జరిగాయని, సబ్‌ కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించామని, మిషరీ కొనుగోళ్లు కూడా జరిపామని తెలిపారు. రద్దు చేయడానికి ఉన్న కారణాలు కూడా ఏమిటో చెప్పలేదని తెలిపారు.


హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండర్‌ విషయంలో ముందుకు ఎలా వెళ్లాలన్న విషయమై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రసుత్తం ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి తుది ఉత్తర్వుల వరకు ఎదురు చూడాలన్న అభిప్రాయం ర ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పోలవరం హైడల్‌, హెడ్‌రెగ్యులేటర్‌కు కలిపి ఒకే నోటిఫికేషన్‌ జారీ చేసినందువల్ల ఈ సమస్య తలెత్తిందని, పాత నోటిఫికేషన్‌ స్థానంలో రెండు వేరు వేరు నోటీసులు జారీ చేస్తే సరిపోతుందని వారు పేర్కొన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: