ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన పరిస్థితి ఇంకా ఆందోళన కరంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన్ను గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనను గత కొన్ని రోజులుగా వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.


తాజాగా అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారం ఆయన్ను మరింతి ఆందోళనకు గురి చేసి ఉంటుందని భావిస్తున్నారు. దీనికితోడుసత్తెనపల్లిలో తన కార్యాలయంలో చోరీ ఘటన కూడా బాధిస్తోంది. తనను రాజకీయంగా.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్న ఆందోళన ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసి ఉండొచ్చని భావిస్తున్నారు.


కోడెల శివప్రసాదరావు కొద్ది రోజులుగా కొత్తపేట లోని తన అల్లుడి నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ అల్లుడు మనోహర్ కు చెందిన లక్ష్మీ ఆసుపత్రి ఉంది. ఆయనకు ఛాతీ నొప్పి వచ్చిన వెంటనే ఆ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోడెల అల్లుడు మనోహర్ కార్డియాక్ స్పెషలిస్ట్. అల్లుడు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.


మాజీ స్పీకర్ కోడెలకు గుండెనొప్పి రావడం ఇది రెండోసారి. మొదటి సారి గుండె నొప్పి వచ్చినప్పుడు స్టంటు వేశారు. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబ‌ాద్ తీసుకెళ్లే ఆలోచన కూడా చేశారు. ఆ తర్వాత ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకున్నారు. తెలుగు దేశం అధికారం కోల్పోయిన నాటి నుంచి కోడెల కుటుంబంపై అనేక కేసులు నమోదయ్యాయి. కుమారుడు, కుమార్తెపై వరుసగా కేసులు పెట్టారు. దీంతో కుమారుడు, కుమార్తె ఇద్దరూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు.


అసెంబ్లీ సామగ్రిని తన సొంత ఇంటికి తరలించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన కూడా అంగీకరించారు. 2018లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి 30 ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లారంటూ కూడా కోడెల మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోడెలకు గుండెపోటు విషయం తెలిసి తెలుగుదేశం నాయకులు కొందరు ఆసుపత్రికి వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: