తెలంగాణ‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మ‌రో ప్రాజెక్టుపై  ఫోక‌స్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టును శ‌ర‌వేగంగా పూర్తయ్యే స్థితికి తెచ్చిన‌ట్లే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడంద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. మిగతా సగానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంద్వారా నీరివ్వాలని అన్నారు. 


వచ్చే వర్షాకాలంలో పంటపొలాలకు నీరందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే రేయింబవళ్లు, మూడుషిప్టుల్లో పనిచేసి ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో జరుగాల్సిన పనులపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, కాల్వల పనులను సమాంతరంగా చేపట్టాలని చెప్పారు. సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రపర్యటన జరిపి, పనుల్లో వేగం పెంచాలని కోరారు.

ఇదిలాఉండ‌గా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని పలు ప్యాకేజీల సొరంగం పనుల పర్యవేక్షణ, రాతి నిర్మాణా ల నిర్వహణతో పాటు సొరంగం, మట్టిపొరల పరిశోధనను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ రాక్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌ఎం) కొన‌సాగిస్తోంది. ఏడాదిపాటు పరిశోధన బాధ్యతలు ఎన్‌ఐఆర్‌ఎం నిర్వహించేలా ప్ర‌భుత్వం గత మార్చిలో బాధ్య‌త‌లు అప్పగించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపరిధిలోని ప్యాకేజీ నంబర్ 1,5,8,16లలో సొరంగం పనులు చేపట్టా రు. ఇక్కడ భూమి, మట్టిపొరల పరిశోధన అవసరమని సీఎం కేసీఆర్ గతంలో నిర్వహించిన సర్వేలో ఆదేశించారు. కాళేశ్వరం తరహాలోనే ఈ ప్రాజెక్టులో కూడా పరిశోధనలుచేయాలని సీఎం ఇంజినీర్లకు సూచించారు. దీంతో ఎన్‌ఐఆర్‌ఎం ఏజెన్సీకి పరిశోధన బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల తాగునీరు అందిస్తారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెకుకు దాదాపు 50వేల ఎకరాల భూమిని సేక‌రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: