నేతలు చెప్పే మాటల్లో ఏది నిజమో  ? ఏది అబద్ధమో ? తెలియాలంటే లై డిటెక్టర్ టెస్ట్ చేయిస్తేనే తెలుస్తుంది. అనేక అంశాలపై వివిధ రాజకీయపార్టీల నేతలు తమ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. అదేవిధంగా ఒకే అంశంపైన కూడా పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే లైడిటెక్టర్ టెస్ట్ అనే విషయం ప్రస్తావించాల్సొస్తోంది.

 

రీసెంట్ గా వచ్చిన వరదల అంశాన్నే తీసుకుందాం. కరకట్టపై నిర్మించిన అక్రమనిర్మాణంలో చంద్రబాబునాయుడు నివాసముంటున్న విషయం తెలిసిందే. ఆ ఇంటిని ముంచేయటానికి ప్రభుత్వమే కావాలని వరదను సృష్టించిందని చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి అక్రమనివాసంలో ఉంటున్నందుకు సిగ్గుపడాల్సిన చంద్రబాబు ప్రభత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు.

 

ప్రకాశం బ్యారేజిని వరద ప్రభావం నుండి తప్పించటానికి ఎప్పటికప్పుడు నీటిని బ్యారేజి నుండి విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ చెప్పిన లెక్కలను టిడిపి నమ్మటం లేదు. వరద ముంపులో ముణిగిపోతుందనే తాము చంద్రబాబును అక్రమనివాసం నుండి ఖాళీ చేయమని చెప్పినట్లు మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ చంద్రబాబు ఆరోపణల కరెక్టా ? మంత్రులు చెప్పిన కారణాలు కరెక్టా ? అన్నది తేలటానికి లై డిక్టెటర్ టెస్ట్ ఒక్కటే మార్గం.

 

తాజాగా రాజధాని మార్పు విషయంలో కూడా అందరూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనాల్లో అయోమయం కలిగిస్తున్నారు. రాజధాని అమరావతి నుండి దొనకొండకు మార్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారంటూ చంద్రబాబు, ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరితో పాటు టిడిపి నేతలు, సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తదితరులు జగన్ పై ఒకటే దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి ఎల్లోమీడియా ఆజ్యంపోస్తోంది.

 

అసలు రాజధాని విషయంలో జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుండి దొనకొండకు మార్చే ఆలోచన ఏదైనా జగన్ మనసులో ఉందో లేదో తెలియాలంటే ఎలా ? దీనికి కూడా లై డిక్టెటర్ టెస్టే శరణ్యం. ఒకసారి ఓ విషయంలో లై డిక్టెటర్ టెస్ట్ ఉపయోగించటం మొదలైతే ప్రతీ ఆరోపణకు, ప్రత్యారోపణకు ఈ టెస్టే ప్రమాణికమవుతుంనటంలో సందేహం లేదు. ఈ విధానాన్ని రాజకీయ నేతలు ఒప్పుకోకపోవచ్చు కానీ మామూలు జనాలకు మాత్రం ఎంతో రిలీఫ్ ఇస్తుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: