దమ్మున్న పత్రికగా చెప్పుకునే ఓ తెలుగు మీడియా ఆంధ్రుల చరిత్రపై, ఆంధ్ర నాయకుల తీరుపై సంచలన వ్యాఖ్యలు రాసింది. ఆంధ్రులు ఒకళ్ల కాళ్లు పట్టుకుని మరొకరు లాగుకుంటారని రాజకీయాలతో రాష్ట్రానికి చేటు చేస్తారని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఏపీలో రాజధాని వివాదం రాజుకుంటున్న సమయంలో దమ్మున్న పత్రిక తన సంపాదకీయంలో ఈ కామెంట్స్ చేయడం విశేషం.


ఇంతకీ ఆ పత్రిక తన సంపాదకీయంలో ఏం రాసిన కొన్ని కామెంట్స్ చూడండి..

“ అన్న క్యాంటీన్‌లను మూసివేయడంపై నిరసన వ్యక్తంచేస్తున్న అన్ని వర్గాలవారు కూడా రాజధాని విషయానికి వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ సమాజం ఎంతటి సంక్లిష్టమైనదో దీన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు. ఏ ఒక్కరూ ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించరు.. అంగీకరించరు. అందుకే ఎడ్డెం అంటే తెడ్డెం అనేవాళ్లు ఏపీలో ఎక్కువగా కనిపిస్తారు.”


"ఆంధ్రావాళ్లు తెలివైనవాళ్లే. అయితే అందరూ తెలివైన వాళ్లు కావడం వల్లే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ నాయకులు, మేధావులు అనబడేవారు రాష్ట్రానికి శాపంగా పరిణమించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు స్వరాష్ట్రం కావాలని ఉద్యమించి కోర్కె నెరవేర్చుకున్నారు. “


"కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా, మద్రాసు నగరం కూడా తమకే కావాలని పట్టుబట్టి తమిళ తంబీలతో ఛీ కొట్టించుకున్నారు. ఫలితంగా రాజధాని కర్నూలులో గుడారాలతోనే నెట్టుకొచ్చిన కొన్నాళ్లకు హైదరాబాద్‌పై కన్నేసి తెలంగాణతో కలిసిపోయారు.ఐదేళ్ల క్రితం రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా తమకు ఏమి కావాలో కేంద్రాన్ని స్పష్టంగా కోరకుండా హైదరాబాద్‌ కూడా కావాలనీ, అసలు రాష్ట్ర విభజనే వద్దంటూ మంకుపట్టు పట్టి చివరకు రాజధాని కూడా లేకుండా విడిపోయారు. ”


" ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మేధావులు కొందరు మనకు అంత రాజధాని అవసరమా? అని కూనిరాగాలు తీస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన అన్ని వర్గాలవారూ ఒకే గొంతుక వినిపించగా, రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పటికీ భిన్నస్వరాలు వినిపించడం ఒక విషాదం! ఆంధ్రా మేధావులు, నాయకులను పీతల గుంపుతో పోల్చారు తెలంగాణకు చెందిన ఒక ప్రముఖుడు. బుట్టలో వేసిన పీతలు బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. అయితే బయటపడే దశలో మరో పీత మొదటి దాని కాలు పట్టి వెనక్కి లాగుతుంది. ఘనత వహించిన ఆంధ్రా మేధావులు, నాయకులు ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారు.“


మరింత సమాచారం తెలుసుకోండి: