ఆరోగ్యశ్రీ.. ఈ పథకం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే.. అప్పటి వరకూ ఓ ఫ్యాక్షన్ లీడర్ గా ముద్రపడిన ఆయనకు మానవతామూర్తిగా జనం గుర్తుంచుకునేలా చేసింది. ఆయన తనయుడు జగన్ కూడా ఇప్పుడు జనం ఆరోగ్యం కోసం దృష్టి పెడుతున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందిస్తున్నారు. ఈ దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయి.


పేదలకు వైద్యం అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యంగా చక్కటి నిర్ణయాలు తీసుకున్నారి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంటున్నారు. వైద్య, ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం సంకల్పించారన్నారు. పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించామని చెప్పారు. ప్రతి రూపాయి నిరుపేదలకు చేరాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.


మారుమూల ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్యశ్రీలో మరో 1000 వైద్య సేవలను పెంచామని తెలిపారు. 104, 108 వాహనాల్లో సౌకర్యాలను పెంచబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. 773 కొత్త 108 వాహనాలను కొనుగోలు చేయబోతున్నామన్నారు. 676 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయబోతున్నామని చెప్పారు.


సెప్టెంబర్‌ మొదటివారంలో టెండర్లు ఖరారు చేస్తామని నాని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. మరోవైపు.. జగన్ నిరుపేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని మరో డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని వైద్యులకు సూచించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఆమె ఇటీవల తనిఖీ చేశారు. గిరిజనులు వస్తే మీ కుటుంబ సభ్యుడిగా స్పందించాలన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రజలకు సరైన ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తే.. వారు కలకాలం గుర్తుంచుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: