ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్టైన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించలేమంటూ తిరస్కరించింది.ఇంతకుముందు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని, సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత తాము ఈకేసు విషయంలో తలదూర్చలేమని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టులోనే బెయిల్ పిటిషన్ వేసుకోవాలంటూ సుప్రీం సూచించింది.  ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


 
ఈ కేసులో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గతవారమే తోసిపుచ్చింది. ఈ కుంభకోణంలో చిదంబరం ప్రధాన సూత్రధారి అంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టుకు వెళ్లారు. చిదంబరం వేసిన పిటిషన్‌ ను వెంటనే విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆగష్టు 21న సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు మునుపే తాము బెయిల్‌ పిటిషన్‌ అప్లై చేశామని, దీని ఆధారంగా  విచారణ జరపాలని చిదంబరం తరఫు న్యాయవాది నేడు కోర్టుకు విన్నవించుకున్నారు. ఇప్పటికే చిదంబరం అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్‌ ను విచారించలేమని కోర్టు తెలిపింది. 


అయితే.. సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేశారు. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉండటంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోమని గత వారమే న్యాయస్థానం స్పష్టం చేసింది. నేటితో చిదంబరం సీబీఐ కస్టడీ ముగియనుంది. దీంతో అరెస్టు తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగాల్సి ఉంది. అరెస్టు తర్వాత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా లిస్టు కాలేదన్న సుప్రీం ఈ పిటిషన్ పై తర్వాత విచారణ చేపడతామని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: