నవ్యాంధ్ర రాజధాని అమరావతి..ఇది గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడూ మారుమోగిన పేరు. టీడీపీ అధినేత చంద్రబాబు కలల రాజధాని. అధికారంలో ఉన్నంత కాలం బాబు అమరావతి పేరు తలవని రోజు లేదు. రాజధాని నిర్మాణం అలా ఉండబోతుంది...ఇలా ఉండబోతుంది అంటూ గ్రాఫిక్స్ తో ప్రజలని ఏ స్థాయిలో మభ్యపెట్టారో చూశాం. ఇక ఈయన గ్రాఫిక్స్ రాజధాని వల్ల రియల్ ఎస్టేట్ ఎంత బాగా జరిగిందో తెలుసు. రాజధానిలోగానీ చుట్టుపక్కల భూముల ధరలు కోట్లలో పలికాయి.


హైదరాబాద్ మాదిరి ఒకేచోట అభివృద్ధి జరిగినట్లు అమరావతి లో కూడా అభివృద్ధి చేద్దామని బాబు కలలు కన్నారు. అయితే దానికి తగ్గ పనిచేయకపోయిన అమరావతిని మాత్రం ఆకాశంలో చూపించారు. అయితే బాబు ప్రజావ్యతిరేక పాలన, అబద్దాల పాలనని అర్ధం చేసుకున్న ప్రజలు వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ సీఎం అయ్యారు. ఇక ఇక్కడ నుంచే బాబు కలల రాజధాని అమరావతికి బీటలు పడటం మొదలైంది. చంద్రబాబులా తాము మాయమాటలు చెప్పమని ఉన్నది ఉన్నట్లుగా చెబుతూనే పాలన కొనసాగిస్తామని జగన్ ముందుకు వెళుతున్నారు.


అందులో భాగంగానే జగన్ సరికొత్త అభివృద్ధి ఆలోచనలతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన జగన్ అన్నీ ప్రాంతాల ప్రజల ఆలోచనల్ని తెలుసుకున్నారు. ఒకేచోటే అభివృద్ది చేస్తే ప్రాంతీయ భేదాలు తలెత్తుతాయని ముందే ఆలోచించారు. అధికారంలోకి వస్తే అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే జగన్ అధికారంలోకి వచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులేస్తున్నారు. అందుకోసం ఆయన ఒకే చోట రాజధాని ఉంచాలని అనుకోవడం లేదని తెలుస్తోంది.


13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు జగన్ ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఒక ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేసి దానికి విజయనగరంని కేంద్రంగా చేశారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాకి ఒక బోర్డుగా చేసి దానికి కాకినాడ కేంద్రాన్ని, అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గుంటూరు కేంద్రం, ఇక రాయలసీమ నాలుగు జిల్లాలకు కడప కేంద్రంగా చేశారు. ఈ నాలుగు కేంద్రాలని రాజధానులుగా చేసుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఇదే మాటని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా చెప్పారు. ఒకవేళ ఇదే గాని నిజంగా జరిగితే జగన్ చరిత్రలో నిలిచిపోతారు. ఇలా చేయడం వల్ల చుట్టూ పక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి బాట పడతాయి. ఇప్పటికే 13 జిల్లాలకు న్యాయం జరిగేలా ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన జగన్...నాలుగు రాజధానులు ఏర్పాటు చేస్తే ఏపీ అభివృద్ధిలో దూసుకెళుతుంది. మొత్తం మీద ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టీడీపీ అధినేత రాజధాని కల చెదిరి వ్యథ మిగలడం ఖాయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: