ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి,  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో  భేటీ అయ్యారు. ఈ భేటీలో  వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నాడు.  ఈ సందర్భంగా జగన్ - అమిత్ షా ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర అభివృద్ధికి సంబందించిన పలు అంశాల పై  చర్చించారు.  దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలో అలాగే  పలు అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని, అలాగే ఏపీ విభజన చట్టంలో అమలు చేయాల్సిన పలు పెండింగ్‌ అంశాలను కూడా  అమలు చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారట.  అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులను,  ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన  నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని జగన్,  అమిత్ షాని కోరినట్లు సమాచారం. ఇక ఈ సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని  అమిత్‌ షాతో చెప్పినట్లు తెలుస్తోంది.  


కాగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విషయమై జరుగుతున్న చర్చల పై కూడా అమిత్ షా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాజధాని అమరావతి విషయంలో గత టీడీపీ ప్రభుత్వం చాలా అవినీతికి పాల్పడిందని, అక్రమంగా అమరావతిలోని రైతుల భూములన్నీ కూడా బెదిరించి లాక్కున్నారని, చంద్రబాబు అవినీతిని అంతటిని కూడా బయటపెడతామని..  జగన్ అమిత్ షాతో చెప్పారట. అయితే ఇప్పటికే  రాజధాని భూముల అంశం పై పోరాటం ఉధృతం చేస్తామని, తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేస్తామని బీజేపీ నాయకులు అన్న సంగతి తెలిసిందే. మరి రాజధాని విషయంలో మోదీ - షా ఆలోచనలు ఎలా ఉన్నాయో గాని, ఈ సమావేశంలో మాత్రం అమిత్ షా  రాజధాని అంశం గురించి ప్రస్తావించలేదట.  అయితే ఈ రాజధాని నిర్మాణానికి అక్కడి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, వారికి న్యాయం చేసే విధంగా తమ నిర్ణయం ఉంటుందని కేంద్రం పెద్దలు  రాష్ట్ర నాయకులకి సూచించినట్లు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: