పద్దెనిమిదేళ్ళ కొండా సుశీల. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి. ఆమె తల్లి ఒక ‘మాతంగి’, మాదిగ కులంలో పుట్టింది. ఆమెది చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, తొండవాడ గ్రామం. తల్లి మాతంగి.. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటూనే హాకీ క్రీడపై దృష్టిసారించింది. ఆమె ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పటినుంచి హాకీ క్రీడ పట్ల ఆసక్తి ఏర్పడింది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో పది పూర్తి చేసింది. ఉదయం, సాయంత్రం ఒక్కతే గ్రౌండ్ కి వెళ్లి ఎంతో పట్టుదలగా ప్రాక్టీస్ చేసేది.


ఊర్లో ఇతరులు ఆమె తల్లికి మగతోడు లేకపోవడాన్ని, ఆమె గతాన్నీ అడ్డం పెట్టుకుని మాట్లాడే హీనమైన మాటల్ని పంటి బిగువున భరిస్తూ సుశీల తన లక్ష్యం వైపు ద్రుష్టి పెట్టి పట్టుదలతో హాకీ ఆటలో ప్రావీణ్యం సంపాదించి విజయం వైపు దూసుకెళ్తుంది. ఇప్పుడామె హాకీలో జాతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి హాకీ టోర్నమెంటుకి కూడా సుశీల ఎంపికైంది.


తానెంచుకున్న రంగంలో అత్యున్నత ప్రతిభ సాధించి సమాజం తమ నుదుటి మీద రాసిన పిచ్చి గీతల్ని తుడుచుకోవాలనే సుశీల తాపత్రయం ఎంతోమందికి స్పూర్తిదాయకం. తానొక ఉత్తమ క్రీడాకారిణిగా రాణించి తన తల్లికి తనదైన ఒక సొంత ఇల్లు కట్టించాలనేదే సుశీల జీవితాశయం. ఇల్లులేక ఇప్పటిదాకా అమ్మ ఎన్నో స్థలాలు మారింది, గుడి దగ్గర బతికాము. ఒక ఇల్లుంటే బాగుంటుంది అనేదే నా కోరిక అంటుంది కొండా సుశీల.


తను బాగా చదువుకుని తన క్రీడారంగంలో కష్టపడి రాణించి సమాజం నుంచి ఎదురయ్యే అన్ని రకాల వ్యతిరేక పరిస్థితులను అదిగమించవచ్చని సుశీల అంటుంది. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగొచ్చి తమ ప్రతిభతో కులం గీసిన అడ్డుగోడల్ని, పేదరికం తాలూకు అసౌకర్యాల్ని కూలగొడుతున్న సుశీల అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందాలని కోరుకుందాం.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలకు తగిన శిక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహం అందితే.. దేశం గర్వించే విజయాలు సాధిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: