దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి కేంద్రం నడుము బిగించింది. జాతీయస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చేసేందుకు ప్రత్యేక అథారిటీని నియమించాలని నిర్ణయించింది. 47 నదుల అనుసంధాన ప్రక్రియపై ఈ నెల 21న ఢిల్లీలో రాష్ట్రాల జల వనరులశాఖ ముఖ్యకార్యదర్శులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. నదుల అనుసంధానానికి జాతీయ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డీపీఆర్‌ రూపకల్పనకు కసరత్తు చేపట్టిందన్నారు. గోదావరి-పెన్నా సంధానంపై పరిశీలిస్తున్నట్టు తెలిపారు. 
జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి నిధులు పూర్తిగా భరిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇదివరకే చేపట్టిన గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని ప్రస్తావిస్తూ తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడాన్ని అభినందించింది. అదేవిధంగా ఇదివరకు కేంద్రానికి సమర్పించిన గోదావరి-పెన్నా అనుసంధాన కార్యక్రమం కూడా పరిశీలన దశలో ఉందని వెల్లడించింది.  




ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకున్న గోదావరి-పెన్నా నదుల అనుసంధానాన్ని.. గోదావరి-కావేరి నదుల అనుసంధానంగా మార్చేందుకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో కర్ణాటకను కోరినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకిస్తోంది. వాస్తవానికి మహానది నుంచి కావేరి దాకా గోదావరి జలాలను తరలించేందుకు కేంద్రం ఇప్పటికే కార్యాచరణకు సన్నద్ధమైంది. ఒడిసా ఇందుకు అంగీకరించలేదు. నదుల అనుసంధాన ప్రక్రియలో తాము భాగస్వాములు కావాలనుకోవడం లేదని తెగేసి చెప్పింది. అయితే.. డీపీఆర్‌ తయారు చేసేందుకు రాష్ట్రాలకు అభ్యంతరాలేమిటని కేంద్రం ఎదురు ప్రశ్న వేసింది. పైగా ఈ కార్యక్రమానికి తానే పూర్తిగా నిధులు భరిస్తానని తెలిపింది.




గోదావరి-కృష్ణా (నాగార్జున సాగర్‌) లింక్‌, కృష్ణా(నాగార్జునసాగర్‌)పెన్నా(సోమశిల) లింక్‌, పెన్నా(సోమశిల)- కావేరి(గ్రాండ్‌ ఆయకట్టు)కు సంబంధించిన ముసాయిదా సమగ్ర నివేదికను కేంద్రం సంబంధిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పంపింది. దీనిపై వాటి అభిప్రాయాలను కోరింది. అభిప్రాయాలు పంపితే తుది డీపీఆర్‌ను తయారు చేయవచ్చని పేర్కొంది. పరిశీలనలోని పథకాలు : వైన్‌గంగ (ఘోస్‌ఖుర్ద్‌)-నల్‌గంగ (పూర్ణ తాపీ) అంతర్రాష్ట నదుల అనుసంధానం డీపీఆర్‌ను మహారాష్ట్ర ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పథకం పూర్తయితే.. 3,71,277 హెక్టార్లకు సాగు నీరందుతుంది. వాటితో పాటు ఆ రాష్ట్రంలోని నాగపూర్‌, వార్ధా, అమరావతి, యవత్‌మల్‌, అకోలా, బుల్దానా నగరాలకు తాగునీరు, పారిశ్రామికావసరాలూ తీరతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: