35 మెగా ర్యాలీలు...370 సమావేశాలు... జమ్మూకాశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలకు వివరించి చెప్పేందుకు బీజేపీ మరో అడుగు వేయబోతోంది. జమ్మూకాశ్మీర్‌ సహా వివిధ రాష్ట్రాల్లో నెల రోజుల పాటు విస్తృతంగా ప్రజలతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి మెగా ప్రోగ్రామ్‌ను ప్రారంభించబోతోంది...జమ్మూకాశ్మీర్‌లోని కీలక ప్రాంతాల్లో కూడా బీజేపీ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది.


జమ్మూకాశ్మీర్ ప్రత్యేక అధికారాలను ఎందుకు రద్దు చేశాం...? ఆర్టికల్ 370తో పాటు 35ఏను తొలగించడం ద్వారా ఏం సాధించాం...? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలతో సమావేశాలు నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. 35 ఏ తొలగించడాన్ని గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా మొత్తం 35 మెగా ర్యాలీలను ప్లాన్ చేశారు బీజేపీ పెద్దలు. అలాగే జమ్మూకాశ్మీర్‌కు మొన్నటి వరకు ప్రత్యేక అధికారాలను కల్పించిన ఆర్టికల్ 370 రద్దు కారణాలను వివరిస్తూ..
అన్ని రాష్ట్రాల్లో 370 సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు.


జమ్మూకాశ్మీర్‌ ప్రజలను సంప్రదించకుండా... వారి అభిప్రాయాలు తెలుకోకుండా ఏకపక్షంగా కేంద్రం జమ్మూకాశ్మీర్‌ను విభజించిందని విపక్షాలు విమర్శిస్తుండటంతో,  ఆ రాష్ట్ర ప్రజలకు కూడా పరిస్థితులు వివరించాలని బీజేపీ నిర్ణయించింది. బారాముల్లా, సోపోర్, శ్రీనగర్‌తో పాటు జమ్మూకాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించబోతోంది బీజేపీ. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలను చేపడతారు. జమ్మూకాశ్మీర్‌కు కేంద్రం పూర్తి స్థాయిలో న్యాయం చేసిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. 35 మెగా ర్యాలీలు, 370 సమావేశాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, బీజేపీ కార్యదర్శులంతా పాల్గొంటారు. కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయం జమ్మూకాశ్మీర్ భవిష్యత్తుకు ఎలాంటి మేలు చేయబోతుందో వివరిస్తామని బీజేపీ నేతలు  చెబుతున్నారు. రెండు విడతలుగా ఈ కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. ముందుగా 35 మెగా ర్యాలీలు నిర్వహిస్తారు. ఆతర్వాత ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో 370కి పైగా సమావేశాలను నిర్వహిస్తారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: