ఏపీలో రాజ‌ధాని విష‌యం గ‌డిచిన వారం రోజులుగా రోజుకో వివాదంగా మారిపోయింది. గుంటూరు ప్రాంతం లోని తుళ్లూరును కేంద్రంగా చేసుకుని ఏర్పాటు చేసిన రాజ‌ధానిపై ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలోని కీల‌క నేత‌లు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ఇది వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతం.. కొండ‌వీటి వాగు పొంగితే.. మునిగిపోవ‌డం ఖాయం, భూములు కూడా చ‌వుడు బూములు.. ఇక్క‌డ ఒక భ‌వ‌నం క‌ట్టాలంటే.. రెండు మూడు భ‌వ‌నాల‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రించాల్సి ఉంటుంద‌ని చేసిన వ్యాఖ్య‌ల‌తో రేగిన దుమారం.. ఇప్పుడు తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ రంగు పులుముకుంది. 


అంతేకాదు, కేవ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే ఇక్క‌డ భూములు కొనుగోలు చేశారంటూ .. ఆయ న చేసిన వ్యాఖ్య‌లు కూడా తీవ్ర దుమారానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో మంత్రి బొత్స రాజ‌ధానిలో దాదాపు 600 పైచిలుకు ఎక‌రాల‌ను గ‌త టీడీపీ ఎంపీ, ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి సొంతం చేసుకున్నార‌ని కూడా ఆరోపించారు ఈ క్ర‌మంలోనే సుజ‌నా చౌద‌రి రంగంలోకి దిగి ఎక్క‌డున్నాయో చూపాలంటూ.. ఆయన స‌వాల్ విసిరారు. 


దీనికి ప్ర‌తిగా మ‌రుస‌టి రోజే స్పందించిన బొత్స‌.. ఆయా భూముల తాలూకు వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. మ‌రోప‌క్క‌, టీడీపీ ఆధ్వ‌ర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా త‌ట‌స్థంగా ఉన్న కొంద‌రు ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా ఇప్పుడు ఈ ఉద్య‌మానికి గొంతు క‌లిపారు. ఇక‌, బీజేపీ నేత‌లు ఏకంగా రాజ‌ధానిలో ప‌ర్య‌టించారు. ప్ర‌స్తుతం ఇది ఘోస్ట్ సిటీ ఉంద‌ని సుజ‌నా వ్యాఖ్యానించారు. 


త‌న అమ్మ‌గారి తాలూకు భూములు అక్క‌డెక్క‌డో ఉంటే వాటిని కూడా రాజ‌ధానిలో చూపిస్తున్నార‌ని ఇంత‌క‌న్నాదారుణం ఏముంటుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, కొంద‌రు మ‌హిళా రైతులు మీడియా ముందు నేరుగా మంత్రి బొత్స‌కే స‌వాల్ విసిరారు. ఇలా మొత్తంగా చూసుకుంటే.. రాజ‌ధానిలో భూముల వివాదం స‌రికొత్త మ‌లుపు తిరుగుతోంది. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ కానీ, ప్ర‌బుత్వంలో నెంబ‌ర్ 2గా ఉన్న ఆర్తిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డికానీ స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: