గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌తో పాటు దాదాపు 15కు పైగా వివిధ థీమ్‌ల‌ను ప్ర‌తిబింభించే 47  అర్బ‌న్ లీవింగ్ థీమ్ పార్కులు రూ. 120 కోట్ల‌తో కొత్త‌గా నిర్మించేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు సిద్దం చేసింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుతం ఉన్న ఇందిరా పార్కు, వెంగ‌ళ‌రావు పార్కు, కృష్ణ‌కాంత్ పార్కు, చాచా నెహ్రూ పార్కుల అనంత‌రం న‌గ‌రంలో మేజ‌ర్ పార్కుల నిర్మాణం ఇంత వరకు జరగలేదు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రింత నాణ్య‌మైన జీవ‌న వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు న‌గ‌రంలో ఒక ఎక‌రానికి పైగా ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి వాటిలో ప్ర‌త్యేకంగా థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేసేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు 47 స్థ‌లాల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. ఈ 47 స్థలాల్లో రూ. 120 కోట్ల వ్య‌యంతో థీమ్ పార్కుల‌ ఏర్పాటుకు జిహెచ్ఎంసి నిర్ణయించింది.






నగ‌రంలోని అన్ని జోన్‌ల‌ను క‌వ‌ర్‌చేసే విధంగా ఈ పార్కుల నిర్మాణం చేపట్టడంతో పాటు ఈ థీమ్ పార్కుల్లో స్వ‌చ్ఛ హైద‌రాబాద్ ఇతివృత్తాన్ని తెలిపే 12 పార్కుల‌ను జోన్‌కు రెండు చొప్పున ఏర్పాటు చేయడానికి జిహెచ్ఎంసి నిర్ణయించింది. ఈ స్వ‌చ్ఛ థీమ్ పార్కుల్లో త‌డి, పొడి చెత్త సేక‌ర‌ణ‌, సేంద్రీయ ఎరువ‌ల త‌యారీ, ఇంకుడు గుంత‌ల నిర్మాణం, ట్రాన్స్‌ ఫ‌ర్ స్టేష‌న్ల నిర్వ‌హ‌ణ‌, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌, డంప్‌యార్డ్‌ల క్యాపింగ్ ప‌నులు, కాలేశ్వర ప్రాజెక్ట్, స్వచ్ఛ హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను తెలుసుకునే విధంగా ఈ పార్కుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. స్వ‌చ్ఛ‌త పార్కుల‌తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌,ట్రాఫిక్ సంబంధిత, రెయిన్ వాట‌ర్ హార్వెస్టింగ్‌, చిల్డ్ర‌న్స్ పార్కు, తెలంగాణ సంస్కృతి, యూనివ‌ర్స‌ల్ థీమ్ పార్కు, సైన్స్ పార్కు, రెయిన్ ఫారెస్ట్ థీమ్ పార్కు, అడ్వంచ‌ర్ థీమ్ పార్కు త‌దిత‌ర వినూత్న అంశాల‌తో కూడిన పార్కుల‌ను ఏర్పాటు చేస్తున్నారు.





గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌ల‌కు ప్ర‌త్యేకంగా ఉద్యాన‌వ‌నం లేదు, తద్వారా ఈ ప్ర‌తిపాదిత 47 పార్కుల్లో చిల్డ్ర‌న్స్ థీమ్ పార్కుల నిర్మాణానికి ప్రాధాన్య‌త ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ప్ర‌తి పార్కు చుట్టూ వ‌ర్ష‌పునీరు నిల్వ ఉండేలా ప్ర‌త్యేక క‌ద‌కం ఏర్పాటు చేయ‌డంతో పాటు వ‌ర్ష‌పునీరు ఇంక‌డంతో పాటు వాటిని నిల్వ చేసుకునేందుకు భారీ ట్యాంక్‌ను భూగ‌ర్భంలో నిర్మించాల‌ని జీహెచ్ఎంసీ ప్రతిపాదిస్తోంది. ఈ పార్కుల‌కు స‌మీపంలోని ఎస్‌.టి.పిల ద్వారా వ‌చ్చే నీటిని నిర్వ‌హ‌ణ‌కు వినియోగించనున్నారు. ప్ర‌తి థీమ్ పార్కును స‌మీపంలోని పాఠ‌శాల విద్యార్థినీవిద్యార్థులు సంద‌ర్శించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఈ పార్కుల్లో ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్థాల ద్వారా ప్ర‌త్యేక థీమ్ పార్కుల‌ను ఏర్పాటు చేయాల్సిందిగా న‌గ‌రంలోని ప్ర‌ముఖ ఐటీ కంపెనీల‌ను కోరాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. ప్ర‌తి పార్కుల్లో న‌గ‌ర స్వ‌చ్ఛ‌త, చ‌రిత్ర, సంస్కృతి, సాంప్ర‌దాయాలను తెలిపే ఆడియో విజువ‌ల్ చిత్రాల‌ను కూడా ప్ర‌ద‌ర్శించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: