ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్మకాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇసుక అమ్మకాలు నిలిచిపోవటంతో నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఇసుక కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం పాత ఇసుక విధానాన్ని రద్దు చేయటం వలన ఈ సమస్యలు మొదలయ్యాయి. ఇసుక కొరత వలన రాష్ట్రంలో భవనాల నిర్మాణాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 
 
రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉండటంతో తెలుగుదేశం పార్టీ  నాయకులు కొంతమంది గుంటూరు జిల్లా మంగళగిరిలో ధర్నాకు దిగారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. మంగళగిరిలోని మూసివేసిన అన్న క్యాంటీన్ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. గృహ నిర్మాణ కార్మికులు కొంతమంది ఇసుక కొరత వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులను నారా లోకేశ్ గారికి వివరించారు. 
 
తెలుగుదేశం పార్టీ నాయకులు పేదల రాజ్యాన్ని పులివెందుల రాజ్యంగా మార్చారని ప్లకార్డులను ప్రదర్శించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 వ తేదీ నుండి కొత్త ఇసుక విధానం అమలులోకి రాబోతుంది. ఈ విధానం అమలులోకి వచ్చాక ఇసుక కొరత కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు టెండర్లను పిలవడం, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయటం జరిగింది. 
 
రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడటంతో సిమెంట్ ధరలు కూడా తగ్గాయి. అమ్మకాలు భారీ స్థాయిలో తగ్గటం వలనే సిమెంట్ ధరలు తగ్గించినట్లు తెలుస్తుంది. 350 రుపాయల సిమెంట్ బస్తా ధర 250 రుపాయలకు తగ్గినట్లు సమాచారం. ఇటుక ధరలు కూడా 7 రుపాయల నుండి 5 రుపాయలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఐరన్ ధర కూడా 5,000 రుపాయల నుండి 7,000 రుపాయల వరకు ఇతర కారణాల వలన తగ్గినట్లు తెలుస్తోంది. ఇసుక అందుబాటులోకి వస్తే ఈ ధరలు మరలా సాధారణ స్థాయికి వస్తాయని తెలుస్తోంది. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: