కొత్త రెవెన్యూ చట్టం పేరుతో తమను బలిపశువు చేస్తున్నారని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పై దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు రెవెన్యూ ఉద్యోగులు. పది లక్షల కరపత్రాలతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం సెగలు రేపుతోంది. ముఖ్యంగా దీని పై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అవినీతి పేరుతో ప్రభుత్వం తమను బలిపశువులను చేస్తోందని వీఆర్వో, వీఆర్ ఏ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా దశల వారీగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే వీఆర్వో వీఆర్యేల సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనం నిర్వహించాయి

కార్యాచరణలో భాగంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. దీనికి అన్ని జిల్లాల నుండి వీఆర్వోలు, వీఆర్ ఏలు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో నిర్వహించిన రెవెన్యూ ఉద్యోగుల ఆత్మ గౌరవ సభలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సభలో పాల్గొన్న నేతలు ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆరు నెలల క్రితం మెచ్చుకున్న ప్రభుత్వం ఇప్పుడు అవినీతిపరులే అనడం ఏంటని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ నిలదీశారు.

వీఆర్వోలు, వీఆర్ ఏల వెంటపడి పెద్దలను వదిలేస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్పడుతుంటే కలెక్టర్ లు గడ్డి పీకుతున్నారా అని సీపీఎం నేత వీరయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో వీఆర్వో, వీఆర్ ఏలను భాగస్వామ్యులను చేయాలని భూ రికార్డుల నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. గ్రామస్థాయిల భూపరిపాలన చూసేందుకు ఒక వ్యక్తి తప్పని సరి అన్నారు.


భూ సర్వే టైటిల్ గ్యారంటీ చట్టం భూ సమస్యలు సత్వరం పరిష్కరించే వ్యవస్థ పారదర్శక మ్యుటేషన్ విధానం కొత్త రెవెన్యూ చట్టంలో వుండాలని న్యాయ నిపుణుడు సునిల్ తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం పై ప్రభుత్వ వైఖరిని బట్టి దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి వీఆర్వో, వీఆర్ ఏల సంఘాలు. ఇతర రెవెన్యూ సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పది లక్షల కరపత్రాలు ముద్రించి ప్రజల్లోకి వెళ్లి వివరించాలని నిర్ణయించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: