తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాల‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర రీతిలో స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు, పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లా పార్టీ కార్యాలయాలపై కేటీఆర్ చర్చించారు. ముందుగా అందరితో మాట్లాడిన కేటీఆర్​ తర్వాత ఒక్కో జిల్లా ఇన్​చార్జ్​తో విడిగా సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితిపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఈ సంద‌ర్భంగా న్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురాలని, ఆ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కట్టడి చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. ‘‘కాంగ్రెస్, బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ రెండు పార్టీలు మున్సిపల్​ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకోవచ్చు. లోక్​సభ ఎన్నికల్లో  ఆ రెండు పార్టీలు ఒక్కటై మన అభ్యర్థులను ఓడించారు. మళ్లీ అదే తీరుగా చేతులు కలుపుతారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే వారి ఉమ్మడి ఎజెండా. మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని టీఆర్ఎస్ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.


మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. లోక్​సభ ఎన్నికల సమయంలో ఆ కుట్రలను పసిగట్టడంలో విఫలమయ్యామని, అందుకే 7 ఎంపీ స్థానాలను పోగొట్టుకున్నామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ  ఒక్కటవుతాయనే  సమాచారం ఉందని అన్నారు. ఇప్పటి నుంచే అందరూ అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. కోర్టు విచారణ వచ్చే నెల 9కు వాయిదా పడిందని, జడ్జిమెంట్​ను అనుసరించి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పటికే కొన్ని సర్వేలు చేయించామని, అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని వాటిల్లో తేలిందని పార్టీ నేతలకు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: