రాజధాని మార్పుపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాజధాని మార్చేస్తానని చెప్పడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు. అందుకే తాను బయటికి రావాల్సి వచ్చిందని పవన్ రాజధాని ప్రాంతంలో నిర్వహించిన పర్యటనలో అన్నారు.


పవన్ కల్యాణ్ తన పర్యటనలో ఇంకా ఏమన్నారంటే..

" జగన్ రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు. తనను తాను ముఖ్యమంత్రిగా భావించడం లేదు. ఈ ప్రాంత రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఓ పార్టీకి ఇవ్వలేదు. ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా స్పష్టమైన ప్రకటన చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు మేం వ్యతిరేకం కాదు. అలా అని ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలి.”


" వాస్తవానికి కొత్త ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇవ్వాలి అనుకున్నాం. 90 రోజులకే జగన్ రెడ్డి పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేను 90 రోజులకే రోడ్డు మీదకి వచ్చేలా మీరే చేశారు. ప్రజలు తిరుగులేని విజయాన్ని అప్పగించినా జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నట్టు కనబడుతున్నారు. ఇంత మెజారిటీ వచ్చిన ప్రభుత్వం రాజధాని మారుస్తుందని నేను భావించడం లేదు.


2014లో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నాయకులు దొనకొండలో భూములు కొనుక్కున్నారని ప్రజలు అనుకుంటున్నారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి. గత పాలకులు అక్రమాలు చేసారంటూ రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు. అవినీతి జరిగిందని తేలితే విచారణ జరిపించండి. రుజువైతే చర్యలు తీసుకోండి.”


మరింత సమాచారం తెలుసుకోండి: