కాక‌తాళీయ‌మే కావ‌చ్చు కానీ...భార‌త్ విష‌యంలో పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గులుతోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌తో పాకిస్థాన్‌ దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచేసుకున్న విషయం విదితమే. పాకిస్థాన్, భారత్ మధ్య అక్టోబర్‌లో యుద్ధం జరుగొచ్చని ఇటీవల రైల్వే మంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌ను ఇరుకున పెట్టేందుకు కరాచీ మీదుగా విమానాల రాకపోకలపై పాక్‌ నిషేధం విధించింది. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నానాయాగీ చేస్తున్న పాకిస్థాన్‌.. అంతర్జాతీయంగా ఒంటరవుతుండటంతో విలవిలలాడుతోంది. ఈ క్ర‌మంలోనే ఊహించ‌ని షాక్‌లు...ఝ‌ల‌క్‌లు ఎదుర్కుంటోంది.


 
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు వ్యతిరేకంగా ఇస్లామాబాద్‌లో ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా.. పాకిస్థాన్‌కు చెందిన ఓ మంత్రికి కరెంట్‌ షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌ రైల్వేశాఖ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ ప్రధాని మోదీని ఉద్దేశించి.. మీ ఉద్దేశాలు మాకు తెలుసు అని మాట్లాడుతుండగా పాక్‌ మంత్రికి కరెంట్‌ షాక్‌ తగిలింది. మైక్‌ ద్వారా ఆయనకు కరెంట్‌ షాక్‌ తగలడంతో.. వెంటనే స్పందిస్తూ.. ఇది విద్యుదాఘాతం అనుకుంటాను. మోదీ మనల్ని ఎప్పటికీ ఏం చేయలేడు అని షేక్‌ రషీద్‌ అహ్మద్‌ పేర్కొన్నారు.


మ‌రో రూపంలోనూ పాక్ క‌రెంటు షాక్‌ను ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే. విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్న కారణంతో సాక్షాత్తూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (ఐఈఎస్సీవో) నోటీసులు జారీచేసింది. ఇమ్రాన్ సచివాలయం తమకు రూ.41 లక్షల విద్యుత్ బిల్లు బకాయిపడినట్టు పేర్కొంది. అధికారులకు బిల్లులు చెల్లించాలని ఎన్ని నోటీసులు పంపించినా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ప్రధాని కార్యాలయం చెల్లింపుల్లో జాప్యత వల్ల విద్యుత్ ఉత్పత్తిచేస్తున్న ప్రైవేటు సంస్థలకు తాము బిల్లులు చెల్లించలేకపోతున్నట్టు సదరు కంపెనీ వాపోయింది. ఈ నేపథ్యంలోనే.. ప్రధాని కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ నోటీసులిచ్చినట్టు ఐఈఎస్సీవో అధికారులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: