ఆంధ్రప్రదేశ్ సర్కార్ వికేంద్రీకరణకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇంతకాలం అమరావతి అని జపించిన పాత ప్రభుత్వం స్థానంలో కొత్తగా వచ్చిన వైసీపీ సర్కార్ అమరావతిని నామమాత్రం చేస్తోంది. ఈ విషయంలో ఎవరేమనుకున్నా ప్రభుత్వం తన పని తాను చేసుకునిపోతోంది. అమరావతిలోనే అన్నీ పెట్టి మొత్తం పదకొండు జిల్లాల ప్రజలకు సున్నం కొట్టే పాత విధానాలకు జగన్ స్వస్తి వాచకం పలికేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.


ఈ నేపధ్యంలో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత రాజధాని గ్రామాలు కొండవీటి వాగు ముంపు బారిన పడుతున్నందున మంగళగిరి ప్రాంతానికి కూడా కొన్ని ప్రధాన కార్యాలయాలు తరలించాలని నిర్ణయించినట్లుగా తాజాగా వైసీపీ సర్కార్ నిర్ణయించినట్లుగా  తెలియవచ్చింది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు గుంటూరు, విజయవాడలో ఏర్పాటయ్యాయి. వీటికి అద్దెలు తడిసి మోపెడవటంతో పాటు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో హెచ్‌ఓడీ కార్యాలయాలను ఒకే చోటకు తరలించాలనే భావనతో ప్రభుత్వం ఉంది. 


ఈ నేపథ్యంలో 65వ నెంబర్ జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కాజ గ్రామంలో రామకృష్ణ వెనిజుయా అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఆర్డీఏ పరిధిలో ఉన్న వెనిజుయా అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడం ద్వారా రాజధాని విషయంలో వస్తున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 800 కోట్లకు సంస్థ ధర నిర్ణయించగా రూ.600 కోట్లకు ప్రభుత్వ ప్రతినిధులు బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం.


హెచ్‌ఓడీ కార్యాలయాలతో పాటు కొన్ని కీలకమైన శాఖలను వెనిజుయా ప్రాజెక్ట్‌కు తరలిస్తే అమరావతి ప్రాంతంలో శాశ్వత ప్రభుత్వ భవనాలతో పనిలేదని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 2500 కోట్లు నిధులు విడుదల చేసింది. అమరావతి నిర్మాణంతో పాటు రైతుల భూముల వ్యవహారంలోనూ టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వాటి మీద కూడా విచారణకు వైసీపీ సర్కార్ రెడీ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: