అనంతపురంకు చెందిన ఆ మంత్రి, ఎమ్మెల్యేలు అధికారికంగా సమావేశమయ్యారు అంటే అంతా గందరగోళమే. గంటల తరబడి వాదనలు ప్రతివాదనలతో వాగ్యుద్ధం కొనసాగుతుంది. మంత్రికి మద్దతుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతిధులు వ్యతిరేకంగా అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు వత్తాసు పలుకుతారు. దీంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. వారి మధ్య ఎప్పుడూ సమావేశం జరిగినా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా గొడవ పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్టుగా ఉంది అనంతపురం జిల్లాలోని అధికార పక్ష ప్రజా ప్రతినిధుల తీరు.


వివరాల్లోకి వెళితే అనంతపురం రెవెన్యూ భవన్ లో ఇటీవల రెండు వేల పంతొమ్మిది, రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను తుంగభద్ర ఎగువ కాలువ పథకం హంద్రీ నీవా సుజల స్రవంతి అంటే హెచ్ ఎన్ ఎస్ ఎస్ సాగు నీటి సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ హాజరయ్యారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తో పాటు అనంతపురం జిల్లాకు చెందిన శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దామాషా ప్రకారం కడప జిల్లాకు నీటిని కేటాయించేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లా పై వివక్ష ప్రదర్శించారని న్యాయంగా తమకు దక్కాల్సిన నీటిని అనంతపురం జిల్లా లోనే వినియోగించుకుంటున్నందున తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాదించారు.


మా వాటా మాకు ఇవ్వాల్సిందే అంటూ కడప నేతలు ఆది లోనే ఈ సమావేశంలో గట్టిగా పట్టుబట్టడంతో గందరగోళం ఏర్పడింది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. మైలవరం జలాశయం పులివెందుల ఉప కాలువలకు నీటి కేటాయింపులపై ప్రశ్న లేవనెత్తిన అనంతరం కడప నేతలు ఆ సమావేశం నుంచి వెళ్లి పోయారు. సమీక్ష సమావేశం హాలు నుంచి అలాగ బయటకెళ్లారో లేదో ఇలా తీవ్ర గందరగోళం చెలరేగింది. జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణ టార్గెట్ గా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాటల దాడికి దిగారు. హాంద్రినీవా కోటా కింద ఐదు టీఎంసీల నీటిని పిఎబిఆర్ లో నిల్వ ఉంచాల్సిందేనని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకు పట్టుబట్టారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అధికారులు గణాంకాలతో వివరించినప్పటికీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంగీకరించలేదు.



ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వాదనను సమర్థిస్తూ అధికారులపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు.జిల్లా స్థాయి అధికారులను సైతం ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడ్డంతో సమాధానాలు చెప్పలేక వారు నీళ్లు నమిలారు. ఈ దశలో జిల్లా కలెక్టర్ లు నీటి పారుదల శాఖాధికారులు మొత్తం చిన్నబోయారు. ఈ తరుణంలో మంత్రి శంకర నారాయణ జోక్యం చేసుకున్నారు. సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోతుందా, కిలోమీటర్లు తవ్విన హంద్రీనీవా ప్రధాన కాల్వ మడకశిర కాల్వలను పూడ్చేద్దాం. నీళ్లన్నీ అక్కడికి తీసుకెళ్తే ఈ కాలువలన్నీ ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు. నీతో మేము వాదించడం లేదు మాకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాలి అని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బదులివ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. జిల్లాకు చెందిన బీసీ మంత్రి టార్గెట్ గా చేసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాటల దాడి చేస్తున్నారని సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రే మాట్లాడే పరిస్థితి లేక పోతే ఎలా అని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వారిలో వారు చర్చించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: