తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఇక మరో సీనియర్ నేత కడియం శ్రీహరి సైతం అసంతృప్తితోనే పార్టీలో కొనసాగుతున్నారు. కడియం పార్టీ మారతార‌న్న‌ వార్తలు కూడా వచ్చాయి. అన్ని జిల్లాల్లోనూ సీనియర్ నేతలు పైకి చెప్ప‌కపోయినా లోలోపల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీలో ఉన్న అతివ‌లు అందరూ అలకపాన్పు ఎక్కినట్టు పార్టీ వర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 


తమ బాధ కేసీఆర్‌కు,  కేటీఆర్‌కు చెప్పుకున్నా కూడా వీరిద్ద‌రిలో ఎవరు అస్సలు కనిక‌రించడం లేదని కూడా వారు గగ్గోలు పెడుతున్నారట. తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా పోరాటాలు చేసిన మ‌హిళా నేతలు ఇప్పుడు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక రగిలిపోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతున్నా పార్టీ పదవుల్లో... నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశాలు ఇవ్వడం లేదన్న బాధ వారిలో ఉంది. ఆరు సంవత్సరాల్లో కేసీఆర్ ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. 


పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలు... మార్కెట్ కమిటీ లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినా నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల్లో మాత్రం తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఈ కమిటీలో మహిళల మాట ఏమాత్రం పట్టించుకోవడం లేదట. ఇక కేసీఆర్ తొలి క్యాబినెట్ తో పాటు రెండో కేబినెట్లో ఒక మహిళ కూడా మంత్రి అవ్వలేదు. ఇదే అంశంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు మహిళలను కేబినెట్లోకి తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. 


మరోవైపు ఇదే అంశంపై విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నా పార్టీ క్యాడర్... పార్టీ నేతలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చేసింది. కెసిఆర్ కు మహిళలంటే చులకనా అని విపక్షాలు చేస్తున్న విమర్శలకు సొంత పార్టీలోని మహిళా నేతలు సైతం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నామినేటెడ్ పదవుల్లోనూ... పార్టీ పదవుల్లోనూ ..ప్రభుత్వంలోనూ మహిళలకు పెద్దపీట వేస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆ ఆశలు అడియాశలు అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: