అజంఖాన్ గుర్తున్నాడా?  కొవ్వెక్కిన‌ మాట‌లు మాట్లాడి వివాదం సృష్టించుకోవ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. తెలుగింటి ఆడ‌ప‌డుచు, బీజేపీ నేత అయిన‌ జయప్రదను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది తానేనని కానీ అప్పుడు ఆమె ఖాకీ నిక్కర్ వేసుకుందని గుర్తించలేకపోయాయని అజంఖాన్ అన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎస్పీ అభ్యర్థిగా అజంఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అజంఖాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అనంత‌రం , ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ ఆజాంఖాన్ లోకసభలో డిఫ్యూటీ స్పీకర్ రమాదేవీపై  చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.. ’మిమ్మల్ని అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది‘ అని రమాదేవీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


ఇలా నోటీ తీట కామెంట్లకు పెట్టింది పేర‌యిన అజంఖాన్ మ‌రో ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఎంపీ అజాంఖాన్ తమ గేదెను దొంగతనం చేశాడంటూ రాంపూర్‌కు చెందిన ఆసిఫ్, జకీర్ అలీ అనే వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. మూడేళ్ల కిందట (2016 అక్టోబరు 15) తమ ఇంటిపై అజాంఖాన్ తోపాటు మరో అయిదుగురు అనుచరులు వచ్చి దాడి చేశారని, ఈనేపథ్యంలోనే రూ.25000 నగదుతోపాటు ఇంటిబయట ఉన్న గేదేలను కూడ పట్టుకుని పోయారని వారిద్దరూ ఫిర్యాదు చేయగా, పోలీసులు అజాంఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ఇంటి స్థలంపై కన్నేసిన ఎంపీ, అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారంటూ వారిరువురు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
ఇదిలాఉండ‌గా, అజమ్ ఖాన్ కు కేసులు కొత్తకాదు. ఇప్పటివరకు ఆయనపై 50కి పైగా కేసులు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా పుస్తకాల దొంగతనం, భూ ఆక్రమణలు, నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలపై నమోదయ్యాయి.  కాగా ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటి చేసిన బీజేపీ అభ్యర్థి నటి జయప్రదపై కూడ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ కూడా కేసులు నమోదు చేసింది. ఇప్పటికే పలు రకాల కేసులు నమోదయి ఇబ్బందుల్లో ఉన్న అజాంఖాన్‌పై గేదె దొంగతనం కేసు న‌మోదు  కావడం సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: