యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అని అంటే బహుశా మన తెలుగువారిలో చాలా మందికి తెలియకపోవచ్చును కానీ, జననేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రతి ఒక్క తెలుగు వాడికి ఆయన గురించి పూర్తిగా తెలుసు. వృత్తి రీత్యా డాక్టరు పట్టా పుచ్చుకున్నప్పటికీ, ప్రజలకు తనవంతుగా సేవలందించాలనే ద్యేయం మరియు పట్టుదలతో 1978లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించిన రాజశేఖర్ రెడ్డి గారు, అప్పట్లోనే తన అదరగొట్టే స్పీచ్ లతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక పార్టీలో జాయిన్ అయిన అదే ఏడాది పులివెందుల నియోజకవర్గం నుండి గెలుపొందిన రాజశేఖర్ రెడ్డి గారు 1980-82 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కు గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖా మంత్రిగా అలానే, 1982-83 సమయంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేయడం జరిగింది. 

ఇక అదే నియోజకవర్గం నుండి 1983,1985లలో కూడా గెలుపొందిన వైఎస్ గారు, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలో తన పదునైన వ్యాఖ్యలతో అధికపక్షానికి ముచ్చెమటలు పట్టించేవారు. అయితే ఆయన అద్భుతమైన వాక్పటిమ మరియు నాయకత్వ లక్షణాలను మెచ్చి, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, వైఎస్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. ఆ తరువాత కడప నియోజకవర్గానికి జరిగిన 9,10,11,12వ లోక్ సభ ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన వైఎస్ గారు, అనంతరం 1999లో మరలా కొన్నాళ్లకు పులివెందుల అసెంబ్లీ నుండి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో అయన కాంగ్రెస్ పార్టీని గట్టిగా ముందుకు నడిపించారు. 

ఇక ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అద్భుత విజయానంతరం, రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా వైఎస్ సేవలందించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబెర్స్మెంట్, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహకల్ప, పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత కరెంట్ వంటి పథకాలు, ప్రజల్లో వైఎస్ గారికి ఎంతో ఆదరణ, మరియు ఆయన పట్ల విశేషమైన నమ్మకాన్ని ఏర్పరిచాయి. అనంతరం జరిగిన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి అద్భుత విజయాన్ని అందుకొని, వైఎస్ రెండవ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. 

అయితే ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన రెండునెలలకే, పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఆయన తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వైఎస్ గారు చనిపోయి ఇప్పటికి పదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేక పోతున్నాం అని, ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన అభిమానులు నేడు పలు సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు, నేడు తన కుటుంబ సభ్యులతో సహా ఇడుపుల పాటకు విచ్చేసి, వైఎస్ గారి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: