గాలి, ధ్వని, వాతావరణ కాలుష్యం నివారణకు ఏపీఎస్ ఆర్టీసీ దశలవారీగా ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. త్వరలో కనీసం వెయ్యి ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. వీటిల్లో 300 బస్సులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీకి కేటాయించింది.


డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ. 300కోట్ల వరకు నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. దీంతో ఇప్పటివరకు డీజిల్, సీఎన్జీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ నిర్వహణ వ్యయం తగ్గించుకోటానికి విద్యుత్ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవలే సమావేశమై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకుంది. డీజిల్ బస్సు వల్ల కి.మీకి డ్రైవర్ జీతభత్యాలతో కలిపి రూ. 38వరకు ఖర్చవుతోంది. అదే విద్యుత్ బస్సుకు రూ. 19లు మించదని నిపుణుల కమిటీ పేర్కొంది.


కేంద్ర ప్రభుత్వ ఫేమ్ 2 ‘్ఫస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇన్ ఇండియా’ పథకం కింద దేశంలో 64 నగరాలకు 5595 విద్యుత్ బస్సులు మంజూరు చేయగా ఏపీకి 300 విద్యుత్ బస్సులు కేటాయించారు. వీటిలో విశాఖకు వంద, విజయవాడ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలకు 50 చొప్పున మంజూరయ్యాయి. ఒక్కో బస్సు ఖరీదు రూ. 2.18 కోట్లు. ఇందులో కేంద్రం 40శాతం రాయితీ ఇస్తుంది.
ఇక విద్యుత్ బస్సులు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ గేర్లు, 31 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు గంటలు చార్జింగ్ చేస్తే నిరంతరాయంగా ఏడు నుంచి 8గంటలు బస్సు నడుస్తుంది.


ఇదిలావుండగా, సంస్థ చైర్మన్ ఎన్వీ సురేంద్రబాబు మరో 700 బస్సుల కోసం తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మొత్తం వెయ్యి బస్సుల కొనుగోలుకు ఇప్పటికే ప్రతిపాదనలు వెళ్లాయి. విద్యుత్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యూ అండ్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) ఏపీ ట్రాన్స్‌కో, ఎస్సీడీసీఎల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సహకారం అందిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: