అమరావతి రాజధాని సమస్య ఇపుడు ఏపీని పూర్తిగా వ్యాపించి ఉంది. అమరావతి రాజధానిని తరలించవద్దు అని సహజంగానే అక్కడ ప్రాంతీయులు కోరుకుంటారు. అదే సమయంలో తమ ప్రాంతాలకు న్యాయం చేయాలని అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజానీకం అడగడంలోనూ అర్ధం ఉంది. అయితే ప్రాంతాల‌ మధ్య సమన్యాయం, పాలనాపరమైన వికేంద్రీకరణ వంటివి దృష్టిలో పెట్టుకున్నపుడు అమరావతి రాజధాని ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుంది.


ప్రస్తుతం వైసీపీ సర్కార్ అమరావతిలో కొత్త నిర్మాణాలకు వేచి చూసే ధోరణిలోనే కనిపిస్తోంది. అక్కడ కొత్తగా పెట్టుబడి పెట్టి భవనాలు కట్టడం కంటే ఇతర ప్రాంతాలకు అభివృధ్ధిని పంచిపెట్టాలనుకుంటోంది. ఇది ఒకందుకు మంచిదే అయినా ఏపీ దీర్ఘకాలిక అభివృధ్ధి దృష్ట్యా అమరావతి రాజధానిని అలా ఉంచేయడం వల్ల అనేక ఇబ్బదులు తలెత్తుతాయన్న మరో వాదన కూడా ముందుకు వస్తోంది.


ఏ రాష్ట్రానికైనా రాజధాని దిక్సూచిగా ఉంటుంది. ఎవరైనా డెవలప్మెంట్ కి కెరాఫ్ గా రాజధానినే చూస్తారు. ఇతర రాష్ట్రాల వారు అయినా, ఇతర దేశాల వారు అయినా రాజధానికే ముందు వస్తారు. అక్కడ జరుగుతున్న అభివృధ్ధిని చూసి తాము తలో చేయి వేయాలనుకుంటారు. అటువంటపుడు అమరావతిలో సరైన ప్రగతి కనిపించకపోతే పెట్టుబడులకు అవకాశాలు ఎంతమేరకు ఉంటాయన్న చర్చ కూడా వస్తోంది. 


దేశంలోని పలు రాష్ట్రాలకు చెన్నై, బెంగుళూరు, హైదారాబాద్ వంటివి రాజధానులుగా ఉన్నాయి. అలాగే ఏపీ విషయంలో కూడా అమరావతి రాజధానిగా చూపిస్తేనే పారిశ్రామికంగా కానీ ఇతరత్రా కానీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని మేధావులు అంటున్నారు. వికేంద్రీకరణ చేయడం మంచిదే కానీ దానికి ముందు అమరావతిని మరీ స్కెలిటన్ బాడీలా ఉంచడం వల్ల ఇబ్బందులేనని కూడా అంటున్నారు. అమరావతి లో నెలకున్న ఈ విచిత్ర పరిస్థితి త్వరగా సర్దుకోవాలి అని కోరుకుందాము.



మరింత సమాచారం తెలుసుకోండి: