అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్ధులను పెట్టిన ఇబ్బందులకు కొందరు తెలుగుదేశంపార్టీ నేతలు ఇపుడు మూల్యం చెల్లించుకునే పరిస్ధితులు కనబడుతున్నాయి. అలాంటి వారు టిడిపిలో చాలామందే ఉన్నారు. చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) ఛైర్మన్ గా పనిచేసిన అమాస రాజశేఖర్ రెడ్డి వ్యవహారమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది.

 

డిసిసిబి ఛైర్మన్ గా ఉన్నపుడు చాలామంది నేతల్లాగే అడ్డదిడ్డంగా అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడటంతో ఆగిపోతే కథ వేరేగా ఉండేదేమో. కానీ అధికారం చేతిలో ఉంది కదాని ప్రత్యర్ధులను అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళను ముప్పుతిప్పలు పెట్టారు. ఇంకేముంది ? అధికారం మారగానే సీన్ రివర్స్ అయ్యింది. గడచిన మూడు నెలలుగా అరెస్టు భయంతో నానా అవస్తలు పడుతున్నారు.

 

డిసిసిబి ఛైర్మన్ గా పదేళ్ళు పనిచేసిన అమాస గోల్డ్ లోన్లు, ఫ్యాక్టరీ ఏర్పాటుకు రుణాల పేరుతో సుమారు రూ. 20 కోట్ల వరకూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అమాస అవినీతిపై యూనియన్ లీడర్లే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ హయాంలో ఛైర్మన్ అయిన అమాస చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. దాంతో కాంగ్రెస్ హయాంలో ఐదేళ్ళు, టిడిపి హయాంలో మరో ఐదేళ్ళు ఛైర్మన్ గా పనిచేశారు.

 

తనకున్న అధికారాన్ని చూసుకుని అమాస చెలరేగిపోయారు.  పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుదారులను బాగా ఇబ్బంది పడ్డారు.  డిసిసిబి పదవుల నుండి వాళ్ళని ఊడబీకేంత వరకూ నిద్రపోలేదు. సరే అధికారంలో ఉన్నారు కదా ఏమి చేసినా చెల్లిపోయింది. అందులోను పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు కూడా మంటే కదా ? దాంతో అమాస రెచ్చిపోయారు.

 

అయితే ప్రభుత్వం మారగానే అమాస అవినీతిపై విచారణ  జరిగింది. సుమారు రూ. 20 కోట్ల వరకూ అవినీతికి పాల్పడినట్లు లెక్కలు తేలాయి. దాంతో అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ విషయం తెలియగానే వెంటనే అమాస అలర్టయి తన ఆస్తుల్లో కొన్నింటిని అమ్మేసి రూ. 20 కోట్లను బ్యాంకుకు జమ చేసినట్లు సమాచారం. అరెస్టు నుండి తప్పించుకునేందుకే రూ. 20 కోట్లు జమచేశారట. ఆరోపణలకు సమాధానంగా డబ్బులు కట్టేశాను కాబట్టి తనను వదిలేయమని అమాస ఇపుడు పెద్దిరెడ్గి చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.  మరి ప్రభుత్వం ఊరుకుంటుందా ? చూడాలి ఏం చేస్తుందో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: