రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం... అధికారంలో ఉన్నంత సేపు టీడీపీలో చేరిన నేతలు..ఇప్పుడు అధికారం వైసీపీలోకి వచ్చేసరికి అందులోకి వెళ్ళేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కాకపోతే కొత్త నేతలు వస్తే తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం కొత్త నేతలు వస్తే బలోపేతం అవుతుందని ఆశిస్తుంది. అందుకే బలమైన నేతలనీ చేర్చుకునేందుకు సిద్ధపడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా విశాఖపట్నంలో బలంగా ఉన్న ఆడారి కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంది.  విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్, తనయ రమాకుమారిలు జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరారు.


అయితే ఆడారి కుటుంబం చేరిక వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ఇబ్బందిగా మారింది.  అంతకముందు ఈ రెండు కుటుంబాలు టీడీపీలోనే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడూ ఈ రెండు కుటుంబాలు పెద్ద సన్నిహితంగా ఉన్న సందర్భాలు లేవు. పైగా అప్పట్లో దాడి మంత్రిగా ఉంటే ఆడారి తులసీరావు జిల్లాలో చక్రం తిప్పేవారట. ఇక 2014 ఎన్నికల ముందు దాడి కుటుంబం వైసీపీలో  చేరి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకొచ్చి రాజకీయాలకు దూరమయ్యారు. మళ్ళీ మొన్న ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. కానీ సీటు దక్కలేదు. కాకపోతే ఎమ్మెల్సీ పదవో లేక నామినేటెడ్ పోస్టో వస్తుందని దాడి ఆశిస్తున్నారు.


ఇలాంటి తరుణంలోనే ఆడారి కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరింది. దీంతో దాడి కాక మీద ఉన్నారు. ఎందుకంటే విశాఖలో ఆడారి ఫ్యామిలీకి మంచి పట్టుంది. జిల్లాలో బలమైన గవర సామాజికవర్గానికి చెందిన వారు. అంగబలం, ఆర్ధిక బలం కూడా గట్టిగా ఉంది. దీంతో పార్టీలో ఆడారి ఫ్యామిలీ అజమాయిషీ చేసే అవకాశం ఉంది. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించాకే ఆడారి కావలసింది దక్కించుకోవాలని అనుకుంటున్నారు. 


ఇదే ఇప్పుడు దాడి కుటుంబానికి ఇబ్బందిగా మారింది. పైగా ఆడారి పార్టీలో చేరేప్పుడు జిల్లా నేతలు కూడా ఉన్నారు కానీ దాడి లేరు. ఆడారి వల్ల పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుందని, పదవి కూడా రాదని భయపడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల దాడి అసంతృప్తితో ఉండి పార్టీకు దూరం జరుగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: