ఏపీ సీఎం చంద్రబాబు గతంలో.. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారు. అప్పట్లో అవి వివాదాస్పదం అయ్యాయి. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు అన్నారు.. ఇక ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ అయితే మరింత ముదడుగు వేసి... దళితులు మీకెందుకు పదవులు అంటూ వీరంగం వేసినట్టు మీడియాలో వచ్చింది. ఇవన్నీ టీడీపీ నేతలకు దళితుల పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని వైసీపీ అంటోంది.


తాజాగా రాజధాని ప్రాంతంలో జరిగిన ఓ వివాదం ఇందుకు కారణమైంది. రాజధాని ప్రాంతానికి చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు రెచ్చిపోయి శ్రీదేవిని అడ్డుకున్నారు. ఓ దళిత మహిళ మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.


దీంతో.. ఉండవల్లి శ్రీదేవి ఇదంతా చంద్రబాబు ప్రోత్సాహం వల్ల జరిగిందే అని విమర్శిస్తున్నారు. పార్టీ నేత ఎలాంటి వాడో.. నాయకులూ అలాంటి వారే అంటూ విమర్శిస్తున్నారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంత ప్రేమ ఉందో గతంలోనే అర్థమైంది. చంద్రబాబు కుల రాజకీయాలు కార్యకర్తల తలలోకి ఎక్కిపోయాయి అంటూ ఆవేదన చెందారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ అవినీతి, అక్రమాలు అరికడుతున్నామని, ఏదో విధంగా తనను భయపెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘ నా భర్త కాపు సామాజికవర్గం. మేము చర్చికి, మసీద్, టెంపుల్‌కు వెళ్తాం. కుల వివక్ష రాజధాని ప్రాంతంలో చూడడం తలతిరిగినట్లుగా అనిపించింది. సామాజికవర్గం పేరుతో దూషించి నైతికంగా, మానసికంగా కృంగదీయాలని ప్రయత్నించారు.. అంటున్నారు. సున్నితమైన కుల వివక్ష విషయం కావడంతో ఇప్పుడు నేషనల్ మీడియాకు కూడా ఈ వార్త ఎక్కింది. మొత్తం మీద ఈ వివాదం చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: