తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖర్మకు ఈ ముఖ్యమంత్రి దొరికాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మానవత్వం ఎవరికైనా ఉందా?, దవాఖానాల్లో  ఒక మంచంపై ఇద్దరు ముగ్గురు రోగులు వైద్యం పొందుతున్నారని వాపోయారు. ఇదేనా బంగారు తెలంగాణ అని నిలదీశారు. ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని మాజీ మంత్రివర్యులు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ కేంద్రమంత్రివర్యులు బలరాం నాయక్, మాజీ విప్ ఈరవత్రి అనిల్ తదితర నాయకులతో కలిసి భట్టి విక్రమార్క మల్లు మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిని చూస్తుంటే రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని భట్టి అన్నారు. ఆ రోజుల్లో సదుపాయాలు లేక ఒక బెడ్ మీద ముగ్గురు.. నలుగురు.. అవసరం అయితే.. కుప్పగా.. మనుషులను పెట్టి ట్రీట్ మెంట్ చేసేవారని.. ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని భట్టి ఆవేదన చెందారు.





మహబూబాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిగా ఉన్న ఇక్కడ కూడా ఒక బెడ్ పై ముగ్గురిని, చిన్న పిల్లల వార్డులో 6 అమ్మాయిని, 8 ఏళ్ల అబ్బాయిని ఒకే బెడ్ పై ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని అన్నారు. ఇక మరో వార్డులో ఒకే కుటుంబం కానీ ఒక పురుషుడు, ఒక మహిళను ఒక బెడ్ పై ఉంచి వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు. వీటిని చూస్తుంటే మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా?? లేక అనాగరిక ప్రపంచంలో ఉన్నామా ?? అన్న సందేహం కలుగుతోంది అన్నారు. ఒక మంచంపై ముగ్గురు రోగులు ఎలా ఉండగలరు అని భట్టి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఒకరి కాళ్ళు మరొకరి తలమీద..ఇటుపక్క వ్యక్తి చేతులు వేరే బెడ్ మీద,.. వాళ్ళని చూస్తుంటే.. బాధ, ఆవేదన కలుగుతున్నాయని విక్రమార్క అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ.. ? ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ?? భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహ స్వరంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మనకు ఏమి ఖర్మ పట్టి ఈ ముఖ్యమంత్రి దొరికాడు అని భట్టి అన్నారు. ఇదొక దూరదృష్టకరమైన రోజు అని.. మనిషి అయిన ప్రతి ఒక్కరు, మానవత్వం ఉన్న ప్రతివారు.. బాధపడాల్సిన సమయం అని భట్టి  చెప్పారు.





జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆంటే 250 పడకలు ఉండాలని.. ఇక్కడ వంద పడకలు మాత్రమే ఉన్నాయని అన్నారు. అంతేకాక ఇక్కడ ఈసీజీ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, బ్లడ్ సేపరేటర్, ఇలా ఏ ఒక్క సదుపాయం లేవని అన్నారు.  వైద్య పోస్టుల అన్నీ ఖాళీగానే ఉన్నాయని అన్నారు. ఇక్కడి పరిస్థితిపై సూపరింటెండెంట్ ను అడగ్గా.. అన్ని విషయాలు ఉన్నతాధికారులకు తెలియజేసామని.. అయితే ఎక్కడి నుంచి స్పందన రాకపోతే.. ఉన్నంతలోనే వైద్యం అందిస్తున్నట్లు చెప్పారని భట్టి మీడియాకు వివరించారు. అంతకుముందును ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రివర్యులు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు.ఈ ఆస్పత్రిపై వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమాన్యవయం లేదనేందుకు ఇది నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలి అన్నారు.





రాష్ట్రంలో దున్నపోతు ప్రభుత్వం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం   ప్రకటించిందని.. అయితే ఆవిధంగా ఏమాత్రం సౌకర్యాలు కల్పించలేదని భట్టి విక్రమార్క అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఆసుపత్రి భవనాన్ని 2013-14 నాటికి కట్టించిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత ఈ ఆసుపత్రికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి అంటే.. 250 పడకలు ఉండాలని.. కానీ ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని ఆయన  చెప్పారు. కానీ మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్ మాత్రం ఇది 50 పడకల ఆసుపత్రి మాత్రమేనని ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఆయన మీడియాకు వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: